అటవీ భూములకే ఎసరు!!..

12:36 - December 22, 2016

ఖమ్మం : అటవీ భూములను కాపాడాల్సిన ఫారెస్ట్ అధికారులు, రెవిన్యూ అధికారులు కలిసి ఏకంగా 225 ఎకరాల భూమికే ఎసరు పెట్టారు. గ్రామంలో లేని భూమికి సర్వే నెంబర్లు సృష్టించి..తమవిగా మార్చుకున్నారు. ఇంతటితో ఆగకుండా భూమి పేరుతో..బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు పొందారు..పట్టాలు, పహాణీలు ఇచ్చిన రెవిన్యూ , ఫారెస్టు అధికారులకు కబ్జాదారులు ఝలక్ ఇచ్చారు. తమ భూమి ఎక్కడోందో చూపించాలని హైకోర్టును ఆశ్రయించిన భూ బాకాసురులపై 10టీవీ ప్రత్యేక కథనం....

అటవీ భూములపై బకాసుల కన్ను..
ఈ విజువల్స్‌లో మీకు కనిపిస్తున్నది ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం తాళ్లపెంట గ్రామం. ఈ గ్రామాన్ని ఆనుకుని రెవెన్యూ భూమితో పాటు అటవీ భూములు వందల ఎకరాల్లో ఉన్నాయి. కొందరు గ్రామస్తులు ఈ భూముల్లో కొంత భాగాన్ని గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. అయితే కొంతకాలంగా సరిగా వర్షాలు లేకపోవడంతో చాలా వరకు భూమిని గ్రామస్తులు సాగు చేయకుండానే వదిలేశారు. దీంతో వందల ఎకరాల్లో ఉన్న ఈ భూమిపై సత్తుపల్లి ప్రాంతానికి చెందిన భూబకాసురుల కన్ను పడింది.

దాదాపు 225 ఎకరాల భూమి ఆక్రమణ
సాగులోలేని ఈ పోడుభూమలుపై భూకబ్జాదారులు దాదాపు 225 ఎకారాల భూమిని తమ పేరిట రాసుకొన్నారు. రెవెన్యూ, అటవీ అధికారులతో కుమ్మక్కయ్యి పాస్‌ పుస్తకాలను సంపాదించుకున్నారు. రెవెన్యూ రికార్డు ప్రకారం 1 నుంచి 375 వరకు మాత్రమే సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆయా సర్వే నెంబర్లలో మొత్తం 8,4,40 ఎకరాల విస్తీర్ణం భూమి ఉంది. ఎన్నో దశాబ్దాల క్రితం నుంచి 1 నుంచి 375 వరకు మాత్రమే సర్వే నెంబర్లు ఉన్నాయి. అయితే అధికారులు పహణీలో 376 నుంచి 578 వరకు నెంబర్లు సృష్టించారు. 2013-14 మధ్యకాలంలో పాస్ పుస్తకాల్లో కొత్త సర్వే నెంబర్లు పాసు పుస్తకాలు కూడా మంజూరు చేశారు.

ఖంగుతిన్న అధికారులు

ఈ భూ అక్రమదారులు ఏకంగా న్యాయస్థానాన్నే తప్పుదారి పట్టించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ భూమి కనిపించడం లేదంటూ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు..ఆ భూములపై క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులకు అసలు విషయం అర్థమైంది. ప్రజాభిప్రాయ సేకరణలో తామా పేర్లను ఎప్పుడూ వినలేదని, వారికి ఇంతవరకూ చూడలేదని గ్రామస్తులు చెప్పడంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతయ్యింది. మరోవైపు అటవీ అధికారులు కూడా తమ సర్వేలో అలాంటి భూములేవి కనిపించలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఉంటే తమకు చూపించాలని చెప్పినా ఎవరూ ముందుకు రాలేదని స్పష్టం చేశారు.

భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజనుల డిమాండ్
ఇదిలా ఉండగా తమపై అన్యాయంగా కేసులు పెట్టారంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరతరాలుగా తామీ భూమిని సాగుచేసుకుంటున్నామని చెబుతున్నారు. అన్యాయంగా భూమిని ఆక్రమించిన భూకబ్జాదారులపై కేసులు పెట్టకుండా...అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Don't Miss