కబ్జాదారుల అక్రమాలు

18:37 - January 3, 2017

నిర్మల్‌ : జిల్లాలో కబ్జాదారుల అక్రమాలకు అంతేలేకుండా పోతోంది. కాసుల కోసం ఏకంగా చెరువులనే మాయం చేస్తున్నారు. చెరువు శిఖం భూముల్లో దర్జాగా వెంచర్లు వేస్తూ రెచ్చిపోతున్నారు. అమాయకులకు ప్లాట్లు అంటగట్టి అందినకాడికి దండుకుంటున్నారు.  భూ బకాసురుల దెబ్బకు నిర్మల్‌ ధర్మసాగర్‌ చెరువు ఆనవాళ్లే లేకుండా పోయింది.  
చెరువుల ఆక్రమణ
నిర్మల్‌ జిల్లాలో చెరువుల ఆక్రమణ వ్యవహారం పరాకాష్టకు చేరింది. నీటి పారుదల, రెవెన్యూ, డ్వామా, అటవీ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు జరిపిన సర్వేలో విస్తూపోయే నిజాలు బయటపడ్డాయి. కబ్జాకోరుల ఆక్రమణల గుట్టురట్టయైంది. నిర్మల్‌ పట్టణాన్ని ఆనుకుని కాకతీయుల కాలంలో 11 గొలుసుకట్టు చెరువులుండేవి. వాటి కింద వందలాది ఎకరాలు సాగయ్యేవి. స్థానిక ప్రజలకు ఈ చెరువుల నుంచే తాగు నీరు అందేది. నిర్మల్‌  పట్టణం విస్తరించడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో కబ్జాదారుల కళ్లు చెరువులపై పడ్డాయి.  గాజులపేట, ధర్మసాగర్‌, మంజూలపూర్‌, కంచరోని, సూరన్నపేట ప్రాంతాల్లో గొలుసుకట్టు చెరువులు మాయమై.. ఆ స్థానంలో ప్లాట్లు వెలిశాయి. 
చెరువు భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు 
చెరువు భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. చెరువు శిఖం భూములనే కాదు.. రైత్వారీ పట్టాలను చూపి ఏకంగా చెరువు భూముల్లోనే భారీ భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమార్కులు రెచ్చిపోతుంటే.. అడ్డుకోవాల్సిన రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. చట్టాల్లోని లొసుగులను ఆధారంగా చేసుకుని బోగస్ పత్రాలు సృష్టించి కబ్జాదారులు తమ పని కానిచ్చేస్తున్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా చెరువు భూముల్లోని అక్రమ కట్టడాలను తొలగించాల్సిందేనని ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆక్రమణల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
అధికారులు చోద్యం 
నిర్మల్ భాగ్యనగర్ కాలనీలోని పెద్ద చెరువు గతంలో మంజులాపూర్‌తో పాటు నిర్మల్‌ ప్రాంతానికి సాగు నీరందించేది. ఈ భూములను కబ్జాకోరులు ప్లాట్లు చేసి విక్రయించడంతో.. చెరువు భూముల్లో దర్జాగా నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇటు భాగ్యనగర్ అటు ప్రియదర్శిని నగర్ వైపు ఆక్రమణల పర్వం కొనసాగుతూనే ఉంది. భైంసా రోడ్డు వైపు ఉన్న చెరువు శిఖంలో కూడా వ్యాపార సముదాయాలు నిర్మించారు. కబ్జాలను అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. మొత్తానికి చెరువు భూముల ఆక్రమణను సీరియస్‌గా పరిగణిస్తున్న ప్రభుత్వం.. కబ్జాదారులపై కొరడా ఝుళిపించేందుకు సమాయత్తమైంది. నిర్మల్‌ సర్కిల్‌ పరిధిలో 474 చెరువులు పునరుద్దరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం ఏ మేరకు చెరువులను తమ ఆధీనంలోకి తీసుకుంటుందో చూడాలి. 

 

Don't Miss