పటాన్‌చెరులో అగ్నిప్రమాదం రూ.70 కోట్ల ఆస్తి నష్టం

13:53 - April 24, 2018

సంగారెడ్డి : జిల్లా పటాన్‌చెరు మండలం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి రెండు గంటల నుంచి అగర్వాల్‌ రబ్బర్‌ పరిశ్రమ మంటల్లో కాలిపోతోంది. టైర్లకు మంటలు అంటుకోవడంతో అవి పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. దాదాపు ఏడు ఫైరింజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.  పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది. అగర్వాల్ పరిశ్రమ గోదాంలో జనవరిలో కూడా అగ్నిప్రమాదం సంభవించగా అప్పుడు ఛైర్మన్‌ గుండెపోటుతో చనిపోయారు. ఇపుడు అదే పరిశ్రమలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా కిలోమీటరు‌ మేర దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇప్పటి వరకు 60 నుంచి 70 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ఎందరో కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న అగర్వాల్‌ రబ్బరు పరిశ్రమ అగ్నిప్రమాదంలో బుగ్గి కావడం పట్ల తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సంస్థ గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.30కోట్ల మేర నష్టం వాటిల్లిందని.. దాని నుంచి తేరుకునేలోపే మరో ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. యాజమాన్యానికి ప్రభుత్వ పరంగా వీలైనంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. సీఐటియు రాష్ర్ట అధ్యక్షులు చుక్కా రాములు పరిశ్రమను సందర్శించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

Don't Miss