మహిళలు నైటీ వేసుకుంటే రూ.2వేలు జరిమానా..

12:27 - November 9, 2018

పశ్చిమగోదావరి : స్వతంత్ర్య భారతదేశానికి అతి పెద్ద ప్రజాస్వామ్యదేశం అనే పేరు. కానీ ఇక్కడ అన్నింటికి ఆంక్షలే. ముఖ్యంగా మహిళల విషయంలో ఈ ఆంక్షలనేవి మరింత జటిలంగా వుంటాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రాంతంలోని మహిళలకు ఆ ఊరి పెద్దలు ఓ వింత ఆదేశాలను జారీ చేశారు. అదేమంటే ఆ ఊరిలోని మహిళలు నైటీ వేసుకుంటే జరిమానా కట్టాలట. ఈ వింత ఆంక్షలు పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకూ ఈ ఆంక్షలు వర్తిస్తాయట. గ్రామ పెద్దలు పెట్టిన ఈ ఆంక్షలను మహిళలు అతిక్రమిస్తే..రూ.2 జరిమానా, గ్రామ బహిష్కరణ విధిస్తామని పెద్దలు హుకుం జారీ చేశారు. ఈ విషయం ఆనోటా ఈ నోటా బైటకు పొక్కటంతో పోలీసులు, తహశీల్దారు రంగ ప్రవేశం చేశారు. గ్రామ పెద్దల ఆంక్షలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. సంప్రదాయాన్ని కాపాడేందుకే ఇటువంటి నిబంధన విధించామని గ్రామ పెద్దలు వితందవాదం చేస్తుండటం గమనించాల్సిన విషయం.
కాగా సంప్రదాయం పేరుతో మహిళలు సౌకర్యం కోసం వేసుకునే నైటీలపై ఆంక్షలు విధించిన పెద్దలు భారతీయ సంప్రదాయం కాని ప్యాంట్ వేసుకోవటంపై ఆంక్షలు విధిస్తే ఎలా వుంటుందో నని ఊహించి వుండరు. అయినా ఆంక్షలు, సంప్రదాయాలు మహిళలకేనా? పురుషుల కుండవా? అనేది మహిళా సంఘాల వాదన.

Don't Miss