రష్యాలో విమాన ప్రమాదం

07:36 - February 12, 2018

మాస్కో : రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మొత్తం 71 మంది మృతి టేకాఫ్‌ అయిన 10 నిమిషాల్లోనే ప్రమాదం.. దట్టమైన మంచు వల్లే ప్రమాదం జరిగిందని అధికారుల ప్రాథమిక అంచనా రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విమాన సిబ్బందితో పాటు.. 65 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. AN-148 విమానం మాస్కో విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన పది నిమిషాల్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్గునోవ్‌ గ్రామ సమీపంలో కుప్పకూలిపోయింది. విమానం గాల్లో ఉండగానే మంటలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విమానం ముక్కలు ముక్కలుగా అయిపోయి.. వాటి శకలాలు మంచులో చెల్లాచెదురుగా పడిపోయాయి. మంచు దట్టంగా ఉండడంతో సహాయ సిబ్బంది చేరుకోవడం ఆలస్యమైంది. ఈ ప్రమాదంలో ఎవరూ బతికి ఉండకపోవచ్చని అధికారులు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. రాడార్‌తో సంబంధాలు తెగిపోయిన వెంటనే రంగంలోకి దిగిన సిబంది.. దాదాపు 10 గంటల పాటు విమానం కోసం అన్వేషించారు. సరబోవ్‌ ఎయిర్‌లైన్స్‌ నిర్వహిస్తున్న AN 148 ఆర్గునోవ్‌ గ్రామ సమీపంలో కూలిపోయినట్లు గుర్తించారు.

సర్వీసులోకి తీసుకుని 8 ఏళ్లే
కూలిన AN 148 విమానం కొత్తది అని ఎయిర్‌లైన్స్‌ అధికారులు చెబుతున్నారు. దీనిని సర్వీసులోకి తీసుకుని 8 ఏళ్లే అవుతుందన్నారు. ఈ విమానం అంతర్జాతీయ సర్వీసులకు నడిపినట్లు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ సంతాపం తెలిపారు. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన రష్యా రవాణా మంత్రి మాక్సిమ్‌ సోకలోప్‌ విమానంలోని సిబ్బంది సహా ప్రయాణికులందరూ మృతి చెందినట్లు ధృవీకరించారు. అయితే.. ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కానీ, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమానయాన అధికారులంటున్నారు. గతంలోనూ మంచు వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగాయంటున్నారు. 

Don't Miss