తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు పథకం ప్రారంభం

21:58 - May 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు పథకాన్ని.. మంత్రులు ప్రారంభించారు. ప్రపంచంలో ఇలాంటి పథకం ఏ దేశంలోనూ లేదని మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు చెప్పుకొచ్చారు.  రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని మంత్రులు వెల్లడించారు. 

రాష్ట్రవ్యాప్తంగా రైతు బంధు చెక్కుల పంపిణీ ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పట్టా పాసుబుక్‌లతో పాటు రైతుబంధు చెక్కులను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల జీవితాల్లో ఇది మరుపురాని రోజు అని అన్నారు.  

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపాడులో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రారంభించారు. కార్యక్రమంలో హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అద్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. గత పాలకులు రైతుల నడ్డి విరిస్తే.. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని వారీ సందర్భంగా అన్నారు. 

వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ఆయనీ సందర్భంగా అన్నారు. 

నిర్మల్‌ జిల్లాలోని స్వగ్రామం ఎల్లపెల్లిలో గృహనిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. అటవీ మంత్రి జోగు రామన్న కూడా తన జిల్లాలో పథకాన్ని ప్రారంభించి చెక్కులు, పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ నియోజకవర్గంలో.. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.. రైతులకు చెక్కులు, పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. లబ్దిదారులకు శాలువాలతో సన్మానించి.. స్వీట్లు పంచి అభినందించారు. తొలిరోజున బోడపల్లి, బొర్లకుంట, గూడెం గ్రామాల్లో చెక్కులు, పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. 

ఆసిఫాబాద్‌ మండలంలోని బురుగూడ గ్రామంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని దిలావర్‌పూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్‌ రైతులకు చెక్కులు, పట్టాపాసు పుస్తకాలు పంపిణీ చేశారు. మేడ్చల్‌ జిల్లా కేంద్రంలో.. ఎంపీ మల్లారెడ్డి, రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. ధనిక రైతుల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి ధ్యేయమని ఆయనీ సందర్భంగా అన్నారు.

అటు కుత్బుల్లాపూర్‌లోనూ రైతు బంధు పథకాన్ని, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ సుంకరిరాజు ప్రారంభించారు. ముఖ్యమంత్రి దూరదృష్టికి నిదర్శనమే రైతు బంధు పథకమని వారీ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

ఖమ్మం జిల్లాలో ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. రూరల్‌ మండలం ఆరేంపుల గ్రామంలో జరిగిన సభలో.. పెట్టుబడి సాయం చెక్కులను అందించారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి పథకం అమలు లేదని.. అందరికీ తెలంగాణ ఆదర్శప్రాయంగా నిలిచిందని ఆయనీ సందర్భంగా అన్నారు. 

సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో రైతుబంధు పథకాన్ని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ట్రైకార్‌ చైర్మన్‌ తాటి వెంకటేశ్వర్లు రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు.

జగిత్యాల జిల్లాలో ఎంపీ కవిత రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. వ్యవసాయం పండుగ కావాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమని ఈ సందర్భంగా కవిత చెప్పారు. రైతులు... ఎంపీ కవితను,  ఎద్దులబండిపై ఊరేగిస్తూ సభాస్థలి వద్దకు తీసుకు వెళ్లారు.  రైతుల కోసం ఉచిత విద్యుత్తు, గోదాములు, ప్రాజెక్టుల నిర్మాణాలతో పాటు.. ఎరువులు, విత్తనాల కోసం పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు.

కరీంనగర్‌ జిల్లాలోని కోరుట్ల మండలం మాదాపూర్‌లో ఎమ్మెల్యే విద్యాసాగరరావు రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. 
వనపర్తి జిల్లాలోని పానగల్ మండలం అన్నారంలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పంచాయతీరాజ్, మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో రైతుబంధు పథకాన్ని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రారంభించారు. ఈ పథకంతో ఇప్పుడు దేశమంతా కేసీఆర్‌వైపు చూస్తోందని ఆమీ సందర్భంగా అన్నారు. 

నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా రైతుబంధు చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీ అట్టహాసంగా జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చెక్కులను పంపిణీ చేశౄరు. రైతులను అప్పుల ఊబి ఉంచి బయట పడేసేందుకు ప్రభుత్వం సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకుందని నేతలు కితాబిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు అందుబాటులో లేని ఇతర అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పంటపెట్టుబడి చెక్కులు, పాసుబుక్కులు పంపిణీ చేశారు. 
    

Don't Miss