'ఆర్టికల్‌ 35 ఏ' రద్దు చేయొద్దు..

17:50 - August 31, 2018

జమ్ముకశ్మీర్‌ : జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న ఆర్టికల్‌ 35 ఏ అధికరణపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. 35ఏ అధికరణ రాజ్యంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విచారణ వాయిదా వేయాలని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం తరపున ఏఎస్‌జి తుషార్‌ మెహతా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. భద్రతా సంస్థలు ఎన్నికల నిర్వహణలో తలమునకలై ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో సుప్రీంకోర్టు తదుపరి విచారణ జనవరి 19, 2019కు వాయిదా వేసింది. ఆర్టికల్‌ 35 ఏ అధికరణం రద్దు చేయొద్దని కోరుతూ వేర్పాటు వాదులు జమ్ముకశ్మీర్‌లో గురు, శుక్రవారాల్లో బంద్‌ పాటించారు. 1954లో రాష్ట్రపతి ఆదేశాలతో ఆర్టికల్‌ 35 ఏ చట్టబద్దమైంది. ఈ ఆర్టికల్‌ ప్రకారం జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక అధికారాలు సంక్రమించాయి. భూములు, ఉద్యోగాల్లో కేవలం కశ్మీరీలకు మాత్రమే హక్కు ఉంటుంది. 

Don't Miss