పౌరసంఘ నేతలకు సుప్రీంలో ఊరట..

18:55 - August 29, 2018

హైదరాబాద్ : భీమా-కోరేగావ్‌ హింస కేసులో అరెస్ట్‌ అయిన ఐదుగురు పౌరహక్కుల నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్‌లపై దాఖలైన పిటిషన్‌లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు- మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. వారిని సెప్టెంబర్‌ 5 వరకు హౌజ్‌ అరెస్ట్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. వరవరరావు సహా మిగతా నలుగురు మానవ హక్కుల కార్యకర్తలను గృహ నిర్బంధంలో ఉంచాలని, వారని బయటకు వెళ్లకుండా నిరోధించాలని పేర్కొంది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ సెప్టెంబర్‌ 6కు వాయిదా వేసింది. పౌరహక్కుల నేతల అరెస్ట్‌ను ఖండిస్తూ.. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌తోపాటు మరో నలుగురు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఐదుగురిపై తప్పుడు అభియోగాలు మోపారని, వారిని వెంటనే విడుదల చేయాలని పిటిషన్‌లో కోరారు. భీమా-కోరేగావ్‌ హింసాత్మక ఘటనలు, మావోయిస్టులతో సంబంధాలు, చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో పుణె పోలీసులు వరవరరావుతో సహా నలుగురు పౌర హక్కుల కార్యకర్తలను మంగళవారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Don't Miss