శిల్ప మృతిపై సీఐడీ విచారణకు ఆదేశం

11:01 - August 11, 2018

చిత్తూరు : ఎస్వీ వైద్య కళాశాల పీజీ విద్యార్థి డాక్టర్‌ శిల్ప మృతిపై సీఎం చంద్రబాబు సీఐడీ విచారణకు ఆదేశించారు. సత్వరమే విచారణ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు. మరోవైపు శిల్ప మృతికి  ప్రొఫెసర్ల వేధింపులే కారణమని సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. శిల్ప ఆత్మహత్యకు తాము బాధ్యులం కామని ప్రొఫెసర్లు చెబుతున్నారు. 
శిల్ప ఆత్మహత్య వివరాలను చంద్రబాబుకు వివరించిన కలెక్టర్‌
తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల పీజీ విద్యార్థి డాక్టర్‌ శిల్ప మృతిపై సీఎం చంద్రబాబు సీఐడీ విచారణకు ఆదేశించారు. శిల్పమృతి ఘటనపై విచారణను వేగవంతం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం శిల్ప తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు చిత్తూరు కలెక్టర్‌ పీఎస్‌ ప్రద్యుమ్నను కలిశారు. అనంతరం శిల్ప తల్లిదండ్రులు తమ కుమార్తె ఆత్మహత్యపై కలెక్టర్‌తో చర్చించారు. అటు కలెక్టర్‌ కూడా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.
దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్‌
ఇక శిల్ప మృతికి గల కారణాలు తెలుసుకోవటం కోసం సీఐడీ చీఫ్‌ ఆమిత్‌ గార్గ్‌ సిట్‌ విచారణకు ఆదేశించారు. చిత్తూరు డీఎస్పీ జి.వి.రమణకుమార్‌, ఇన్‌స్పెక్టర్‌లు హేమచంద్ర, గౌసేబేగ్‌, అన్వర్‌బాషా, హజరత్‌బాబు, కళావతి ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిట్‌ అధికారులు వైద్యురాలి ఆత్మహత్యకు సంబంధించి నమోదైన కేసుల వివరాలను సేకరించారు. ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో దర్యాప్తును ముమ్మరం చేశారు.
శిల్పమృతికి ప్రొఫెసర్ల వేధింపులే కారణమంటున్న విద్యార్థులు
శిల్ప మృతికి ప్రొఫెసర్ల వేధింపులే కారణమని సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. శిల్ప ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ సరిగ్గా జరగకపోవటం వల్లే శిల్ప మృతి చెందిన చెబుతున్నారు. విచారణ చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 
ప్రిన్సిపాల్‌ను తప్పించటంపై డాక్టర్ల సంఘం ఆగ్రహం
మరోవైపు ఎస్వీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమణయ్యను బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని డాక్టర్ల సంఘం తప్పుబట్టింది. ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డాక్టర్లు డిమాండ్‌ చేశారు. శిల్ప లైంగింక వేధింపుల ఫిర్యాదుపై జరిగిన విచారణకు సంబంధించిన నివేదిక బయటకు రాకపోవటానికి.. రమణయ్యకు ఎలాంటి సంబంధం లేదని డాక్టర్ల సంఘం అంటోంది. మొత్తానికి ప్రభుత్వం ఇప్పటికైనా కేసును సీరియస్‌గా తీసుకోవటంతో శిల్పకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని.. తల్లిదండ్రులు, సహచర విద్యార్థులు భావిస్తున్నారు. 

 

Don't Miss