ఇతను హాస్టల్ వార్డెనేనా..షాకింగ్ వీడియో..

13:24 - January 8, 2018

సంగారెడ్డి : స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తుంటారు...అప్పుడు ఉపాధ్యాయులు..హాస్టల్ వార్డెన్ ఏం చేస్తారు ? వారిని సముదాయించే ప్రయత్నం చేస్తుంటారు అని చెబుతారు కదా..కానీ కొంతమంది విద్యార్థులపై దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇష్టమొచ్చినట్లుగా కొడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎస్టీ హాస్టల్ వార్డెన్ దారుణంగా ప్రవర్తించారు. ఇద్దరు విద్యార్థులను తలకిందులుగా నిలబడాలని చెప్పి..ఓ పైపుతో చితకబాదాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన జహీరాబాద్ లోని షేకాపూర్ లో ఉన్న ఎస్టీ హాస్టల్ లో చోటు చేసుకుంది. అల్లరి చేస్తున్నారనే కారణంతో వార్డెన్ యాదయ్య ఈ శిక్ష విధించాడు. అతను కొడుతున్న దృశ్యాలు చూసిన పలువురు చలించిపోయారు. హాస్టల్ లో ఉంటున్న ఇతర విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయంపై కొంతమంది బాలల హక్కు సంఘం ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

బాలల హక్కుల సంఘం అచ్యుతారావు టెన్ టివితో స్పందించారు. పిల్లలు చదువు కోసం రావాలంటే భయపడుతారని, అక్షరాస్యత ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. నైజాం కాలంలో ఇలాంటివి జరగలేదని, వీడియో బయట వచ్చిన తరువాత కూడా హాస్టల్ వార్డెన్ ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. తాము హెచ్చార్సీని సంప్రదిస్తామని, బాలలకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఇలానే కొనసాగితే అక్షరాస్యత పెరగదని..ఇలాంటి దుర్మార్గాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. దీనిపై విద్యాశాఖ, అధికారులు సమాధానం చెప్పాల్సినవసరం ఉందన్నారు. 

Don't Miss