'సల్మాన్' ఫ్యాన్స్..ఖుష్...

15:18 - April 7, 2018

ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు బెయిల్ లభించింది. దీనితో ఆయన ఫ్యాన్స్, కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ను జోధ్‌పూర్‌ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించింది. బెయిల్ మంజూరు చేయాలని పెట్టుకున్న పిటిషన్ పై శనివారం కోర్టు విచారణ చేపట్టింది. రూ. 50వేల పూచికత్తుతో సల్మాన్ కు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు ఆయన నటించే..నటిస్తున్న సినిమాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. దీనితో ఫ్యాన్స్..కుటుంబసభ్యులు..డైరెక్టర్లు తీవ్ర ఆందోళనలో మునిగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం బెయిల్ రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ 'భారత్‌', 'రేస్‌ 3', 'కిక్‌ 2', 'దబాంగ్‌ 3' చిత్రాల్లో నటిస్తున్నారు. 'రేస్‌ 3' సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. జూన్‌ 15న సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలీవుడ్‌ నటులు సైఫ్ అలీఖాన్, టాబూ, సోనాలీ బింద్రే, నీలమ్‌లను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

 • 1998 అక్టోబర్‌లో 'హామ్‌సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సందర్భంగా... సల్మాన్‌ఖాన్ జోధ్‌పూర్‌కు సమీపంలో గల కంకణి గ్రామంలో జింకలను వేటాడారు.
 • జిప్సీలో సల్మాన్‌తో పాటు సైఫ్ అలీఖాన్, టాబూ, సోనాలీ బింద్రే, నీలమ్‌ కూడా ఉన్నారు.
 • సల్మాన్‌ కృష్ణ జింకలపై కాల్పులు జరిపారు.
 • ఆ కాల్పుల శబ్దం విని బిష్ణోయ్‌ వర్గానికి చెందిన గ్రామస్థులు అక్కడికి రాగా రెండు కృష్ణ జింకలు చనిపోయి ఉన్నాయి.
 • కృష్ణ జింకలను బిష్ణోయి వర్గానికి చెందిన ప్రజలు దైవంగా భావిస్తారు.
 • దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సల్మాన్‌తో పాటు సహనటులపై వారు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.
 • ఈ కేసులో 28 మంది సాక్షులుగా ఉన్నారు.
 • సల్మాన్‌ ఖాన్‌ తుపాకితో కృష్ణ జింకలను చంపినట్లు వారు ఆరోపించారు.
 • సల్మాన్‌ మాత్రం తన వద్ద ఎలాంటి ఆయుధం లేదని, తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని చెప్పారు.
 • సెక్షన్‌ 51కింద సల్మాన్‌ ఖాన్‌పై కేసు నమోదు కాగా...ఇతర నటులపై ఐపిసి 149 సెక్షన్‌ కింద అభియోగాలు నమోదయ్యాయి.
 • ఈ కేసులో సల్మాన్‌ పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు.
 • ఈ కేసుకు సంబంధించిన తుది వాదనలు మార్చి 28న పూర్తి కాగా ఏప్రిల్‌ 5న సల్మాన్‌కు శిక్ష ఖరారు చేసింది.
 • ఏప్రిల్ 7వ తేదీన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

Don't Miss