సల్లూకు బెయిల్ వస్తుందా ?

13:18 - April 5, 2018

ముంబై : కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌‌ను దోషిగా తేల్చిన జోథ్‌పూర్‌ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా నలుగురు నటులు సైఫ్ అలీఖాన్, టబూ, సోనాలి బింద్రే, నీలంలను మెజిస్ట్రేట్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.కృష్ణ జింకల వేట కేసుకు సంబంధించి మార్చి 28నాటికి తుది వాదనలు పూర్తయ్యాయి. అయితే చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దేవ్‌కుమార్ కత్రి తీర్పును వాయిదా వేశారు. ఈరోజు కేసు విచారణకు రాగా సల్మాన్‌ఖాన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష ప్రకటించింది. 1998 అక్టోబర్‌లో జరిగిన హమ్‌సాథ్‌ సాథ్‌ హై షూటింగ్ సందర్భంగా జోథ్‌పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో కృష్ణజింకలను హతమార్చినట్లు సల్మాన్‌పై కేసు నమోదు అయ్యింది. ఇందులో సల్మాన్ ఖాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51కింద కేసు నమోదు చేశారు. ఇతర నటులపై సెక్షన్ 149కింద కేసు నమోదు అయ్యింది. సల్మాన్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ బెయిలుకు అవకాశం ఉండటంతో ఆయన లాయర్లు వెంటనే బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. బెయిల్ మంజూరైన పక్షంలో సల్మాన్ ఒక్కరోజు కూడా జైలు శిక్ష అనుభవించకుండా బయటపడే అవకాశాలుంటాయి. జోథ్‌పూర్ కోర్టు తీర్పుపై నెలరోజుల్లోగా సల్మాన్ పైకోర్టులో సవాలు చేసుకునే వీలుంది.

Don't Miss