సల్మాన్ కు బెయిల్..సర్వత్రా హర్షం...

21:16 - April 7, 2018

ముంబై : కృష్ణ జింకల కేసులో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు ఊరట లభించింది. జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టు సల్మాన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. సాయంత్రం 6 గంటలకు సల్మాన్‌ జైలు నుంచి విడుదలయ్యారు. సల్మాన్‌కు బెయిల్‌ రావడంతో అభిమానులు పండగ జరుపుకున్నారు. 50 వేల పూచీకత్తుపై కోర్టు సల్మాన్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. సల్మాన్‌ బెయిల్‌ లభించినప్పటికీ తదుపరి విచారణకు హాజరు కావాలని... కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లవద్దని కోర్టు షరతు విధించింది.

గత రాత్రి రాజస్థాన్ ప్రభుత్వం 87 మంది జడ్జిలను అకస్మాత్తుగా బదిలీ చేసింది. అందులో సల్మాన్ కేసును విచారిస్తున్న జడ్జి రవీంద్ర కుమార్ జోషి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్‌ బెయిలుపై విచారణ జరుగుతుందా....లేదా..అన్న ఉత్కంఠ నెలకొంది. జడ్జి ఉదయం విధులకు హాజరవ్వడంతో సందిగ్దత తొలగిపోయింది. సల్మాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపి బెయిలు మంజూరు చేశారు.

1998 అక్టోబర్‌లో 'హామ్‌సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సందర్భంగా... సల్మాన్‌ఖాన్ జోధ్‌పూర్‌కు సమీపంలో గల కంకణి గ్రామంలో జింకలను వేటాడారు. ఇందులో రెండు కృష్ణ జింకలు హత్యకు గురైనట్లు సల్మాన్‌పై కేసు నమోదైంది. సల్మాన్‌తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలీవుడ్‌ నటులు సైఫ్ అలీఖాన్, టాబూ, సోనాలీ బింద్రే, నీలమ్‌లను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో జోధ్‌పూర్‌ కోర్టు ఏప్రిల్‌ 5న సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 10 వేల జరిమానా విధించింది. సల్మాన్‌ను గురువారం జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఇదే కేసులో సల్మాన్‌ 1998, 2006, 2007 సంవత్సరాల్లో మొత్తం 18 రోజులు జోధ్‌పూర్‌ జైల్లో గడిపారు. ఇప్పుడు మరో రెండ్రోజులు జైల్లోనే ఉండాల్సి వచ్చింది.

సల్మాన్‌ ఖాన్‌కు బెయిల్‌ లభించడంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు సందర్భంగా శనివారం జోధ్‌పూర్‌ కోర్టు హాలు, పరిసరాలు హీరో అభిమానులతో కిక్కిరిసిపోయింది. ముంబైలోని సల్మాన్‌ ఇంటికి ఫ్యాన్స్‌ భారీగా చేరుకున్నారు. రోడ్లపై వెళ్లేవారికి మిఠాయిలు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. సల్మాన్‌కు బెయిల్‌ దక్కడంపై బాలీవుడ్‌, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

Don't Miss