సమాజ్‌వాదీ పార్టీలో ముగిసిన ముసలం...!

07:01 - January 10, 2017

ఉత్తరప్రదేశ్ : సమాజ్‌వాదీ పార్టీలో ముసలం ముగిసిపోయిందా..? తండ్రి ములాయం పట్టవీడి కొడుకు చెంతకు చేరారా..? గత కొద్ది రోజులుగా ములాయం, అఖిలేష్‌ మధ్య జరుగుతున్న వార్‌కు తెరపడిందా..? తాజాగా ములాయం వ్యాఖ్యలు అలానే అనిపిస్తున్నాయి. కుమారుడు అఖిలేష్‌కు ములాయం జేజేలు కొట్టడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో గతంలో పోటాపోటీగా మద్దతు కూడగట్టిన తండ్రికొడుకుల మధ్య యుద్ధం ముగిసిందని ఎస్పీ కార్యకర్తలు భావిస్తున్నారు. 
ముసలానికి ముగింపు పలికిన ములాయం  
'తిరగబడినా నా కొడుకే కదా..! వచ్చే ఎన్నికల్లో అఖిలేష్‌ యాదవే సీఎం అభ్యర్ధి..! సమాజ్‌వాదీ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు..!' ఇవి సాక్ష్యాత్తు ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు. గత కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. సమాజ్‌వాదీ పార్టీలో తలెత్తిన ముసలానికి ములాయం ముగింపు పలికారు. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా పార్టీని బలోపేతం చేసేందుకే ములాయం మొగ్గు చూపారు. 
వారు ఒక్కటయ్యేందుకు సిద్ధం 
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం, ఉత్తర ప్రదేశ్‌ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ఇద్దరూ తండ్రీ కొడుకులు. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో రెండుగా చీలిపోయారు. సమాజ్‌వాదీ పార్టీ తనదంటే తనది అంటూ పోటాపోటీగా పావులు కదిపారు. పార్టీ గుర్తుకోసం దేశ రాజధానిలో హడావుడి చేశారు. చివరికి కొడుకు అఖిలేష్‌ యాదవ్‌ మెజార్టీ ముందు అధినేత ములాయం వెనక్కి తగ్గారు. ఎంతైనా కొడుకే కదా అని పార్టీ భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. 
వివాదాలకు స్వస్తి పలికిన ములాయం  
ఎన్నో నాటకీయ పరిణామాల నడుమ సమాజ్‌వాదీ పార్టీలో ముసలానికి తెర పడిందనే చెప్పవచ్చు. దేశంలో సంచలనం రేపిన ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. తండ్రీ కొడుకులు రోజుకో ప్రకటనతో పార్టీ కార్యకర్తల్లో గుబులు రేపారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలను ఆయోమయంలో పడేశారు. చివరికి రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వివాదాలకు అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ స్వస్తి పలికారు. 
అఖిలేష్‌ కు మరోసారి పట్టంకట్టేందుకు సిద్ధం 
పట్టువీడిన అధినేత ములాయం.. పార్టీలో సంక్షోభానికి తెరదించారు. కుమారుడు అఖిలేష్‌ యాదవ్‌కు మరోసారి పట్టంకట్టేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే మరోసారి కూడా అఖిలేశ్‌ సీఎంగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేశారు. ఇక పార్టీలో చీలిక అనేది లేదని, సమాజ్‌ వాది పార్టీ అంతా ఒక్కటేనని తేల్చేశారు. ఎన్నికల ప్రచారంలో దూకుతామని ములాయం సింగ్‌ చెప్పారు. ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహం రచించేందుకు ములాయంసింగ్‌తో ఇవాళ అఖిలేష్‌ భేటీ కానున్నాడు. గత కొద్ది రోజులుగా నెలకొన్న వివాదాలకు ములాయం పులిస్టాప్‌ పెట్టడంతో సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. 

 

Don't Miss