కామారెడ్డిలో ఇసుక మాఫియా దారుణం

17:55 - January 4, 2018

కామరెడ్డి : జిల్లాలో ఇసుకమాఫియా రక్తం చిందించింది. తమ వ్యాపారానికి అడ్డొచ్చిన వారిపై శివాలెత్తిపోతోంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే వారికి నరకం చూపిస్తోంది. ప్రత్యక్ష దాడులకు దిగుతూ తమ పైశాచికాన్ని చాటుకుంటోంది. ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు ఓ వీఆర్ఏను కిరాతకంగా హతమార్చారు. పిట్లం మండలం కంబాపూర్ శివారులోని కాకివాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న వీఆర్ఏ సాయిలు రాత్రి సమయంలో అక్కడకు చేరుకున్నాడు. సాయిలు అక్కడే నిలబడి ఇసుక మాఫియా ముఠాని అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సాయిలుపై కోపంతో ఊగిపోయిన మాఫియా అతడిని ట్రాకర్ట్‌తో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీఆర్‌ఏ అక్కడికక్కడే చనిపోయాడు.

ట్రాకర్ట్‌తో ఢీకొట్టి హత్య
కారెగాం గ్రామానికి చెందిన సాయిలు మార్తాండ గ్రామంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నారు. కాకివాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న సమాచారం అందుకున్న సాయిలు... పై అధికారులకు విషయాన్ని చెప్పి ఘటనాస్థలానికి వెళ్లినట్లు తెలుస్తోంది. వీఆర్‌ఏ సాయిలు హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపడంతో.. కారెగాం, మార్తాండ గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మార్వో, పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు గ్రామాల ప్రజలను శాంతింపజేశారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కారెగాం, మార్తాండ వాసులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో చెలరేగిపోతున్న ఇసుకమాఫియాపై రెవిన్యూ అధికారులు, పోలీసులు కొరడా ఝుళిపించాలంటున్నారు. 

Don't Miss