శంకరాభరణం సినిమా రివ్యూ...

18:42 - December 4, 2015

తాను ఇచ్చిన 72 సీన్లు అలాగే చిత్రీకరించి ఉంటే రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా హిట్ అయి ఉండేదని....రీసెంట్ గా రైటర్ కోన వెంకట్ కామెంట్స్ చేశాడు. ఇది నిజమేనేమో అనుకున్నారు కొంతమంది. కానీ...శంకరాభరణం సినిమా చూశాక మాత్రం అది ఖచ్చితంగా నిజం అయి ఉండదని తెలిసిపోతుంది. ఆ 72 సీన్లు అలాగే తీసి ఉంటే...బ్రూస్ లీ మరో పదిరెట్లు అట్టర్ ఫ్లాప్ సినిమా అయి ఉండేదని అర్థమైపోతుంది. ఎందుకంటే కోన వెంకట్ కథ, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన శంకరాభరణం అలా ఉంది మరి. రీమేక్ సినిమాలు నేటివిటీ కుదరకో, ఆర్టిస్టులు సెట్ అవకో ప్రేక్షకులకు నచ్చకుండా తయారవుతాయి...కానీ బాలీవుడ్ ఫిల్మ్ పస్ గయారే ఒబామా ఫ్రీమేక్ శంకరాభరణం మాత్రం....ఆడియెన్స్ కు పీడకలగా మిగిలిపోతుంది. అలా రూపొందించారీ సినిమాను. క్లాసిక్ సినిమా పేరును అంతే గొప్పగా చెడగొట్టారు.....

తండ్రి అప్పుల్లో మునిగిపోగా..

తండ్రి అప్పుల్లో మునిగిపోగా...బీహార్ లో తల్లికున్న ప్యాలెస్ ను అమ్మడానికి ఇండియా వస్తాడు కొడుకు నిఖిల్. ఇక్కడ ప్యాలెస్ లో రెండు డజన్ల మంది బంధువులు తిష్ట వేసి ఉంటారు. పాతికేళ్లుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ల అంగీకారం లేనిదే ప్యాలెస్ అమ్మడానికి లేదు. అప్పనంగా ఉంటున్నారు కాబట్టి అమ్మడానికి వాళ్లు ఒప్పుకోరు. నిఖిల్ తల్లి ప్రేమ పేరుతో తమని వదిలేసి వెళ్లిందనే కోపంతో అతనితో మాట్లాడరు. కానీ వాళ్ల ప్యాలెస్ లో ఉండటానికి మాత్రం వాళ్లకేం ఇది లేదు. ఆ ప్యాలెస్ అమ్మడానికి రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో తంటాలు పడుతుంటాడు హీరో. ఈ లోగా...నిఖిల్ కు మరదలు వరసయ్యే నందిత...తన బావ వందల కోట్లకు వారసుడని..ఊళ్లో చాటింపు చేయిస్తుంటుంది. దీంతో...లోకల్ గా ఉన్న బంధిపోట్లు..మన కథానాయకుడిని కిడ్నాప్ చేస్తారు. సినిమా హీరో కాబట్టి...వాళ్లందరిని తన ప్లాన్లతో బురిడీ కొట్టించి....కథను సుఖాంతం చేస్తాడు......

కథపై సింపథీని క్రియేట్ చేయాల్సింది.....

కథపై సింపథీని క్రియేట్ చేయాల్సింది అందులోని పాత్రలే. క్యారెక్టర్లు ఒకటి రెండు తేడాగా ఉంటే ఫర్లేదు. మొత్తం ఉన్న పాత్రలన్నీ తలతిక్కగా ఉంటే ఆ సినిమా శంకరాభరణంలా తయారవుతుంది. తల్లి, తండ్రి అప్పుల్లో కొంపా గోడూ పోయి రోడ్డున పడితే...ఆ కష్టాలు తీర్చేందుకు ఇండియా వచ్చిన మన హీరో....తాగి తందనాలు ఆడుతుంటాడు. హీరో పరిస్థితి ఇదైతే....అమెరికా నుంచి వచ్చిన అడవి పందైనా తాను పెళ్లి చేసుకోవాడనికి ఓకే అంటుంది హీరోయిన్ నందిత. అమెరికా నుంచి వచ్చింది కమెడియన్ సప్తగిరి అనుకుని అతన్ని లవ్ చేస్తుంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఇక్కడే కిల్ అయ్యింది. చెల్లెలు ప్రేమ పెళ్లి చేసుకుందని ద్వేషించే రావు రమేష్.. ఆ చెల్లిలి ఇంట్లోనే ఎందుకుంటున్నాడో అర్థం కాదు. ఆ ప్యాలెస్ లో పని పాటా లేకుండా తిని తిరుగుతున్న ఓ రెండు డజన్ల మంది...ఓ సందర్భంలో ఇంటి పెద్ద రావు రమేష్ ను చంపేద్దామనుకుంటారు. దీంతో ఆ పాత్రలన్నింటికీ విశ్వాసం లేనట్లయింది. ఇక రౌడీ గ్యాంగుల్లోనూ నిజాయితీ లేదు. అటు క్రూరంగా కాకుండా...ఇటు కామెడీకి లేకుండా పోయారు. ఇక మున్నీ అనే బంధిపోటు పాత్ర అంజలిది. అసలీ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో సదరు క్రియేటివ్ జీనియస్ లకే తెలియాలి...

మొదటి సీన్ లోనే తెలిసిపోతుంది.....

ఇవాళ టైం బాగా లేక సినిమాకు వచ్చామని శంకరాభరణం మొదటి సీన్ లోనే తెలిసిపోతుంది. బీహార్ మనుషులు తెలుగులో మాట్లాడుతారు.. లాజిక్ వదిలేసి సినిమాలోని మ్యాజిక్ చూడండని స్క్రోల్ వేయిస్తారు..కానీ ఎన్ ఆర్ ఐ గా వచ్చిన నిఖిల్ మాత్రం అర్థంకాని అమెరికన్ యాసలో మాట్లాడుతుంటాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా...ఒక టార్చర్ ఐతే....ఇంటర్వెల్ నుంచి పిచ్చి పీక్స్ కు చేరుకుంటుంది. అమెరికా నుంచి వచ్చిన ఎవడైనా పెళ్లి చేసుకుంటానని చెప్పి కమెడియన్ ను లవ్ చేసే హీరోయిన్ నందిత...కుటుంబ సంబంధాలు, మనుషుల మధ్య ప్రేమ గురించి ఉపన్యాసాలు ఇస్తుంటుంది. ఇలా సన్నివేశాలు, పాత్రలు, కథ, మొత్తం సినిమా గొప్పదనం చెబితే చాలదు.. చూసి తరించాల్సిందే.

సినిమాలో ఏమీ లేదు......

సాంకేతికంగానూ శంకరాభరణం సినిమాలో ఏమీ లేదు. మ్యూజిక్ వరస్ట్ గా ఉంటే, ఎడిటింగ్ చేయడం మర్చిపోయారా అని డౌట్ వస్తుంటుంది. దర్శకత్వ పర్యవేక్షణ అనే గొప్ప విషయాన్ని వదిలేస్తే....దర్శకుడు ఉదయ్ తనతో ఇండస్ట్రీకి ముప్పు పొంచి ఉందనే సిగ్నల్స్ పంపించాడు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య సినిమాలతో నటనలో తన ప్రత్యేకత చూపించిన నిఖిల్...శంకరాభరణంతో ఆ గుడ్ విల్ తుడిచేసుకున్నాడు. ఇక ఇలాంటి సినిమాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిదనేది ప్రేక్షకులే చెబుతున్న మాట.....

ఫ్లస్ పాయింట్స్

ఏమీ లేవు

మైనస్ పాయింట్స్

1. కథ, స్క్రీన్ ప్లే, మాటలు

2. దర్శకత్వ పర్యవేక్షణ

3. నిఖిల్

4. నందిత

5. అంజలి

Don't Miss