పండుగొచ్చింది..పల్లెలు కళకళ..

21:08 - January 13, 2018

హైదరాబాద్ : పండుగొచ్చింది... పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. సంక్రాంతిని ఎంజాయ్‌ చేసేందుకు కుటుంబాలన్నీ పల్లెబాట పడుతున్నాయి. పండుగను ఘనంగా జరుపుకునేందుకు గ్రామాలన్నీ సిద్దమయ్యాయి. నగరవాసులంతా పల్లెకు తరలిపోతుండడంతో టోల్‌గేట్ల వద్ద గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ జరుగుతోంది. మరోవైపు పట్టణవాసులంతా ఊర్లకు వెళ్తుండడంతో నగర వీధులన్నీ బోసిపోతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ కనిపిస్తోంది. పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రజలంతా పండుగను ఘనంగా జరుపుకునేందుకు సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. మరోవైపు దూర ప్రాంతంలోని తమ వారంతా వస్తుండడంతో ఆ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పచ్చని వాకిళ్లలో రంగవళ్లికలు కన్నుల విందు చేస్తున్నాయి. ప్రధానంగా కోస్తాంధ్రలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పశ్ఛిమగోదావరిజిల్లా భీమవరంలో అమ్మాయిలు సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు.

నగరమంతా పల్లెబాట పడుతోంది. ప్రయాణికుల రాకతో బస్‌, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రధాన టెర్మినల్‌ అయిన ఎమ్‌జీబీఎస్‌కు వచ్చే దారిలో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక బస్సులను నడుపుతోంది. జూబ్లీబస్టాండ్, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్ నుండి తెలంగాణాలోని వివిధ ప్రాంతాలకు బస్సులు ఏర్పాట్లు చేసింది. మరోవైపు పలువురు తమ సొంత వాహనాలలో ఊర్లకు పయనమయ్యారు. దీంతో నగర శివారులో భారీ ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. అలాగే... టోల్‌గేట్‌ వద్ద గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఇక సంక్రాంతి పండుగకు ఆంధ్రాలో ఉండే సరదానే వేరు. ప్రత్యేకంగా ఈ సరదాల కోసం ఏడాదికోసారి ఎక్కడెక్కడో ఉన్నవాళ్లంతా ఒక్కచోటికి చేరి ఎంజాయ్‌ చేస్తుంటారు. పలు ప్రాంతాల్లో కోడిపందాలను నిర్వహిస్తున్నారు. ఇక కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని.. జిల్లా వ్యాప్తంగా జాయింట్ యాక్షన్‌ టీంలను ఏర్పాటు చేసి పందాలు నిర్వహించకుండా నిరోధిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ తెలిపారు. కత్తులు కట్టి కోడి పందాలు నిర్వహించినా, గాంబ్లింగ్‌ ఆటలాడినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రవిప్రకాష్‌ హెచ్చరించారు. ఇక సంక్రాంతి సంబరాలను జరుపుకునేందుకు నారావారిపల్లికి నారా కుటుంబం, నందమూరి బాలకృష్ణ కుటుంబం చేరుకుంది. సంక్రాంతి సంబరాల్లో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఇక ఇప్పటికే పల్లెపల్లెన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మూడు రోజులపాటు ఎంజాయ్‌ చేసేందుకు ప్రతి ఒక్కరూ కార్యక్రమాలు సిద్దం చేసుకుంటున్నారు. 

Don't Miss