చదువుకోనీకి ఇన్ని కష్టాలా?..

18:12 - January 9, 2017

మహబూబ్ నగర్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించిన వనపర్తి జిల్లా ఇంకా అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉంది. విద్యార్ధులు చదువుకోవడానికి కష్టాలు తప్పడం లేదు. విద్యార్ధులు వాగు,వంకలు దాటాల్సిన పరిస్ధితి. వర్షాకాలంలో పరిస్ధితి మరీ దారుణం..ఈ సమస్యతో భావిభారత పౌరులు చదువులకు దూరమవుతున్నారు.

వనపర్తి జిల్లా శేరుపల్లిలో నిత్యం నరకం
చదువుకునేందుకు ఈ విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.. స్కూల్‌కువెళ్లాలంటే ఈ వాగు దాటాలి.. అబ్బాయిలైతే ఇలా ప్యాంట్‌ చేత్తోపట్టుకొని వాగును దాటేస్తారు.. ఆ తర్వాత మళ్లీ బట్టలు వేసుకుంటారు.. అమ్మాయిలపరిస్థితి అయితే దారుణం... వాగుదాటితే డ్రెస్‌మొత్తం తడిచిపోతుంది.. ఒడ్డుకువచ్చాక బట్టలు మార్చుకోవాలంటే చాలా ఇబ్బందులు.. కేవలం ఈ సమస్య వల్లే చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని స్కూల్‌కే పంపడంలేదు.. ఊర్లోఉన్న ప్రాథమిక పాఠశాలలో చదువుతోనే సరిపెట్టేస్తున్నారు..

వాగు దాటలేక ఇంతగా కష్టపడుతున్న విద్యార్ధులు
విద్యార్థులు వాగు దాటలేక ఇంతగా కష్టపడుతున్న ఈ ఊరుపేరు శేరుపల్లి.. వనపర్తి జిల్లాలోఉంది.. ఈ గ్రామంలో 500 ఇళ్లున్నాయి.. ఇందులో పదివేహను వందల మంది నివాసం ఉంటున్నారు.. ఈ పల్లెవాసులపిల్లలకోసం గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది.. ఈ స్కూల్‌లో చదువు పూర్తయ్యాక చిన్నారులకు అసలు సమస్య మొదలువుతంది.. ఉన్నత చదువులకోసం 4 కిలోమీటర్లు దూరంలో ఉన్న శ్రీరంగాపురం జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్లాలి.. ఈ గ్రామానికి రోడ్డులేదు.. పొలాలు, అడవి మధ్యలోని జింకలోనిబావివాగు దాటి నడక సాగిస్తేనే బడికి వెళ్లడం సాధ్యమవుతుంది..

పై చదువులకు శ్రీరంగాపురంకు వెళ్లే విద్యార్ధులు
జింకలోనిబావివాగు దాటే సమయంలో విద్యార్ధులు తమ ప్యాంట్ విప్పేసి వాగు దాటతారు.. ఆ తర్వాత మళ్లీ డ్రెస్‌ వేసుకొని స్కూల్‌కువెళతారు.. ఆడపిల్లల అవస్థలుమాత్రం చెప్పలేనివి.. కేవలం ఈ వాగు కారణంగానే చాలామంది చదువుకు దూరమవుతున్నారు... చదువు ఎలాగూ ఆపేశామని ఆడ పిల్లలకు తల్లిదండ్రులు చిన్న వయసులోనే వివాహాలు కానిచ్చేస్తున్నారు.. చదువుకోవాలన్న ఆసక్తి బలంగాఉన్నారు.. తల్లిదండ్రుల ప్రోత్సాహంఉన్నవారుమాత్రం ప్రమాదకరమైన వాగును దాటుతూ స్కూల్‌కు వెళుతున్నారు.. మామూలు సమయాల్లో ఎలాగో వాగు దాటి స్కూల్‌కు వెళ్లొచ్చు.. వర్షాకాలంవస్తే వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.. అలాంటి టైంలో పాఠశాలకు వెళ్లడం సాధ్యంకానిపని..

పొలం పనులకు వెళ్లాలంటే రైతులు, కూలీలకు తిప్పలు
ఒక్క విద్యార్థులేకాదు.. శేరిపల్లి, శ్రీరంగపురం గ్రామాల మధ్య నివసిస్తున్న స్థానికులందరికీ ఇవే తిప్పలు.. పొలాలు దున్నేటప్పుడు... పంటలు కోతలకు వచ్చినప్పుడు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు వాగు దాటించడానికి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.

నాలుగేళ్ల క్రితం ఈ వాగుకు బ్రిడ్జ్ మంజూరు
ఈ గ్రామస్తుల సమస్య తీర్చడానికి గతంలో ప్రభుత్వం బ్రిడ్జ్‌ నిర్మాణానికి అనుమతి మంజూరుచేసింది.. ఇక తమ కష్టాలు తీరాయని ప్రజలంతా సంతోషించారు.. అయితే వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు.. ఏళ్లుగడుస్తున్నా బ్రిడ్జ్ నిర్మాణపనులు ఇంకా ప్రారంభం కాలేదు.. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న వనిత అనే నిర్మాణ సంస్ధ... ఫిల్లర్ గుంతలు తీసి వదిలేశారు.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తాము ఎదుర్కోంటున్న వాగు కష్టాలకు పరిష్కారం చూపించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.  

Don't Miss