విశాఖలో స్కూబా డైవింగ్...

07:22 - September 14, 2018

విశాఖపట్టణం : అత్యంత వినోదం, ఉత్కంట కలిగించే ఈ సాహస జల క్రీడకు ఆదరణ పెరుగుతోంది. సముద్రంలోపల జలచరాలతో జలకాలాడుతూ.. అందాలను ఆస్వాదించడం మరపురాని మధురానుభూతి.. దీనివైపు యువత ఆసక్తి కనబరుస్తోంది. విదేశాల్లో క్రేజు పొంది.. ఇప్పుడిప్పుడే ఇండియాకు పరిచయమైన స్కూబాడైవింగ్‌కు  కేరాఫ్‌గా మారబోతోంది విశాఖ. కడలి లోపలి అందాలను కనువిందుచేసే.. అద్భుత విన్యాసం స్కూబాడైవింగ్‌. ఈ సాహస క్రీడకు విశాఖలో ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. ఇక్కడి సముద్రంలో విజన్‌ చాలా పారదర్శకంగా ఉండడంతో.. 30 మీటర్ల వరకూ జలచరాల కదలికలను స్పష్టంగా గమనించవచ్చు.

భవిష్యత్తులో ఈ క్రీడకు విశాఖ కేంద్రంగా మారుతుందన్నారు టూరిజం సీఈఓ. ఉత్తరాంధ్రలో స్కూబా డైవింగ్‌ను ప్రోత్సహించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. చింతపల్లి తీరంలో స్కూబా డైవింగ్‌ అకాడమీ ఏర్పాటుకు లివిన్‌ అడ్వంచర్స్‌ అన్న సంస్థతో పర్యాటకశాఖ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్లుతెలిపారు. విశాఖ-భీమునిపట్నం బీచ్‌రోడ్డులోని మంగమారిపేట వద్ద స్కూబా డైవింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ నుంచి మార్చి వరకు అనుకూలంగా స్కూబాడైవింగ్‌ను.. ఈత రాని వాళ్లు సైతం చేయొచ్చు.గత సీజన్‌లో దాదాపు 200 మంది, ఈ సీజన్‌లో వంద మందికిపైగా పర్యాటకులు సముద్రంలోకి వెళ్లారు. ప్రస్తుతానికి స్కూబాడైవింగ్‌ కోసం ఒక్కొక్కరికి ఐదు వేలు  వసూలు చేస్తున్నారు. ముందు స్విమ్మింగ్‌ పూల్‌లో శిక్షణ ఇచ్చాకే.. సముద్రంలోకి తీసుకెళ్తారు. సముద్రంలో ఫొటోలు, వీడియోలు కూడా తీసుకోవచ్చు.

Don't Miss