సరస్వతి ప్రియుడు దొరికాడు...

07:09 - May 14, 2018

విజయనగరం : జిల్లాలో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసులకు చిక్కాడు. సరస్వతి ప్రియుడు శివను పోలీసులు పట్టుకున్నారు. హత్య జరిగిన 24 గంటల్లోనే ఐదుగురు నిందితులను పోలీసులు పట్టుకోగా... అసలు సూత్రధారి శివ ఎస్కేపయ్యాడు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న శివను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయనగరం జిల్లా పార్వతిపురం భర్త హత్య కేసులో కీలక నిందితుడు.. శివను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ నెల 7న కొంత మంది దుండగులు తన భర్తపై దాడి చేసి, తన బంగారాన్ని కాజేశారని సరస్వతి అనే మహిళ పోలీసులకు తెలియజేసిన విషయం విదితమే. అయితే మర్నాడు కేసు ఊహించని మలుపు తిరిగింది. పథకం ప్రకారం భార్య సరస్వతే కిరాయి గుండాలకు సుపారీ ఇచ్చి భర్త శంకర్రావును చంపించిందని పోలీసులు తెలిపారు. సరస్వతి.. ప్రియుడు శివతో కలిసి శంకర్రావు హత్యకు పథకం పన్నారని పోలీసులు చెప్పారు.

సరస్వతి తనకు ఫేస్‌ బుక్‌లో పరిచయమైన శివ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇంతలో పెద్దలు శంకర్రావుతో ఆమెకు వివాహం నిశ్చయిచడంతో, శివతో కలిసి భర్త హత్యకు ప్లాన్‌ వేసింది. విశాఖపట్నంలో శివకు పరిచయం ఉన్న పాత నేరస్తులు.. సారపల్లి రామకృష్ణ, గోపిలతో శంకర్రావు హత్య విషయం మాట్లాడారు. శంకరావును హత్య చేస్తే తన దగ్గర ఉన్న బంగారాన్ని ఇస్తానని సరస్వతి వారికి తెలిపింది. ముందుగా తన నిశ్చితార్థ ఉంగరాన్ని వారికి ఇచ్చి.. తర్వాత మూడు దఫాలుగా తేజ్‌యాప్‌ ద్వారా 18 వేలు ఇచ్చింది. హత్య తరువాత మిగిలిన బంగారాన్ని ఇస్తానని తెలుపడంతో రామకృష్ణ, గోపిలు.. బంగార్రాజు, కిషోర్‌ అనే మరోఇద్దరితో కలిసి హత్యకు రంగం సిద్ధం చేశారు.

ఈనెల 7వ తేదీన సరస్వతి ఆమె భర్త శంకర్రావు మోటర్‌ వాహన సర్వీసింగ్‌ కోసం పార్వతిపురం వచ్చారు. అయితే వీరిని నిందితులు రామకృష్ణ, గోపి, బంగార్రాజు, కిషోర్‌లు ఆటోలో ఫాలో అయ్యారు. తాము ఏ ప్రాంతంలో ఉన్నామో తెలిసేలా నిందితులకు, సరస్వతి జీపీఎస్ ద్వార లొకేషన్‌ను పంపింది. భార్యభర్తలిద్దరూ తోటపల్లి ఐటీడీఏ పార్కు వద్దకు చేరుకోగానే నిందితులు రామకృష్ణ, గోపి, బంగార్రాజు, కిషోర్‌లు దాడి చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత తన భర్తపై, తనపై కొంతమంది దాడి చేసి బంగారాన్ని కాజేశారని సరస్వతి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. అయితే సంఘటన తీరును నిశితంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ పాలరాజు..నిందితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశాడు.

సరస్వతిని వివరాలు అడిగి తెలుసుకొని తిరిగి బయలు దేరిన ఎస్పీకి మానపురం వద్ద ఆటోలో నిందితులు తారసపడ్డారు. విషయం ఆరా తీయడంతో అసలు పథకం బయటపడింది. భార్య సరస్వతే ప్రియుడు శివతో కలిసి కిరాయి గూండాలతో భర్తను చంపించిందని వెల్లడైంది. కిరాయి గూండాలు పోలీసులకు దొరకడంతో శివ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసు బృందాలు గాలింపును తీవ్ర చేయడంతో శివ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు.

శివ పోలీసులకు దొరకడంతో మరో ఆశ్చర్యకరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. శంకరావుతో వివాహం ఇష్టం లేని సరస్వతి పెళ్లికి ముందే శంకర్రావు హత్యకు పథకం వేసింది. శంకర్రావు బెంగళూర్‌లో పనిచేస్తుండటంతో అక్కడే అతన్ని మట్టుబెట్టాలని కిరాయి గూండాలతో మాట్లాడింది. అందుకు గాను శివ వారికి 25 వేలు చెల్లించాడు. బెంగళూరులో సరస్వతి ప్లాన్‌ వర్కవుట్‌ కాలేదు. దీంతో విజయనగరంలో మర్డర్‌ప్లాన్‌ చేసి.. కటకటాల్లో ఊచలు లెక్కిస్తోంది. 

Don't Miss