ఫుడ్ పాయిజన్

18:02 - December 25, 2016

వరంగల్ : వారంతా ఆయా ప్రాంతాలకు చెందిన వారు..ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంటున్నారు. ఎప్పటిలాగానే సంతోషంగా రెస్టారెంట్‌లో ఫుడ్‌ తిన్నారు. అదే వారి పాలిట విషంగా మారింది. దీంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఇంతగా విద్యార్థులను ఆందోళనకు గురిచేసిన ఈ సంఘటన వరంగల్‌ జిల్లా నిట్‌ లో చోటు చేసుకుంది. 
నిట్ విద్యార్థులకు అస్వస్థత
ఇలా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరంతా వరంగల్‌ జిల్లా నిట్ విద్యార్థులు. రెండు రోజుల క్రితం ఓ రెస్టారెంట్‌లో ఆయా వంటకాలు తిన్నారు. రెస్టారెంట్‌ నుంచి బయటకు రాగానే వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 15 మంది అబ్బాయిలుండగా..మిగిలిన ఐదుగురు అమ్మాయిలు.
నిట్ చుట్టు పక్కల చాలా రెస్టారెంట్లు 
వరంగల్‌లోని నిట్ చుట్టు పక్కల చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టూడెంట్స్‌ని ఆధారం చేసుకొని నడుస్తున్నవే. అయితే క్వాలిటీ పాటించాలని తాము ఎన్నిసార్లు చెప్పినా రెస్టారెంట్ల నిర్వాహకులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తాము రెగ్యులర్‌గా ఈ రెస్టారెంట్లలోనే తింటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఎప్పుడూ జరగని విధంగా ఇలా జరగడం విచారకరమని అంటున్నారు. దీనిపై అధికారులు స్పందించి రెస్టారెంట్లలో క్వాలిటీ మెయింటెయిన్ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికి రెండు రోజులుగా వైద్య సేవలు జరుగుతున్నప్పటికీ..ఇంకా విద్యార్థులు కోలుకోలేదు. మరో రెండు మూడు రోజుల చికిత్స అవసరమని వైద్యులు చెబుతున్నారు. 

 

Don't Miss