సొంతగడ్డకు శ్రీమంతులు ఏం చేస్తున్నారంటే..

15:28 - December 17, 2017

సూర్యాపేట : జీవితంలో ఉన్నతంగా స్థిరపడ్డ వారంతా సొంత గడ్డకు సేవ చేయాలనుకున్నారు. సేవా వారోత్సవాల పేరుతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. సూర్యాపేట జిల్లా సోలిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి నడుం బిగించిన తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులను గ్రామస్తులు అభినందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అమెరికాలో స్థిరపడిన తెలంగాణ ప్రాంత వాసులంతా కలిసి తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతిని కాపాడటమే ప్రధాన ఉద్దేశంగా TATA సంఘం ఆవిర్భవించింది. 2015 నుంచి TATA ఆధ్వర్యంలో తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం TATA సేవా డేస్ పేరుతో సేవా వారోత్సవాలు నిర్వహించాలని తలపెట్టారు. అందులో భాగంగా డిసెంబర్ 14 నుంచి 23 వరకూ వరంగల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి , ఆయా గ్రామాలను దత్తత తీసుకోవడం, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్ల ఏర్పాటు , హెల్త్ కాంపుల నిర్వహణ , ప్రభుత్వ పాటశాలల్లో మౌలిక వసతుల కల్పన, గ్రంధాలయాల ఏర్పాటు చేయాలని సభ్యులు నిర్ణయించుకున్నారు. TATA అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి, ప్రతినిధి మోహన్, ఎన్నారై రాజేందర్‌రెడ్డిల సొంత ఊరు సోలిపేట. అక్కడే చదువుకుని అమెరికాలో హార్ట్ స్పెషలిస్ట్‌గా స్థిరపడ్డ రాజేందర్‌రెడ్డి గతంలో సొంతూరులో స్కూలు భవనాన్ని నిర్మించగా.. తాజాగా TATA ఆధ్వర్యంలో అదే స్కూలుకి మౌలిక వసతుల కల్పనకు రెండున్నర లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. అనంతరం పాఠశాల విద్యార్ధులకు స్కూలు బ్యాగ్‌లను అందించారు. ఈ సందర్భంగా TATA ప్రతినిధులను గ్రామస్తులు కోలాటాల మధ్య గ్రామంలోకి సాదరంగా ఆహ్వానించారు. తమ పాఠశాలకు సహకరిస్తున్న TATA సభ్యులను ఘనంగా సత్కరించుకున్నారు. ఈ కార్యక్రమంలో TATA ప్రతినిధులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

Don't Miss