వరంగల్ చేరుకున్న కొప్పు శరత్ మృతదేహం

09:54 - July 12, 2018

వరంగల్ : అమెరికాలో కన్సాస్ రెస్టారెంట్‌లో ఓ ఉన్మాది కాల్పుల్లో మృతి చెందిన శరత్‌ మృతదేహం.... ఆయన స్వస్థలమైన వరంగల్‌లోని కరీమాబాద్‌కు చేరుకుంది. శరత్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరైయ్యారు. పలువురు నాయకులు శరత్ మృతదేహానికి నివాళులర్పించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు శరత్ తల్లిదండ్రులు మాలతి, రామ్మోహన్, కుటుంబసభ్యులను ఓదార్చారు. కరీమాబాద్ లోని స్మశాన వాటికలో అతని అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఘటనపై మంత్రి కేటీఆర్, డిజిపి మహేందర్ రెడ్డి, కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ లకు శరత్ తల్లిదండ్రులు నివేదిక ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అమెరికాలోని భారతీయులకు రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. అమెరికా కన్సాస్‌లోని ఒక రెస్టారెంట్‌లో ఓ దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న తెలంగాణ విద్యార్థి కొప్పు శరత్‌ దొంగతనాన్ని అడ్డుకోబోయినందుకు ఆ దొంగ తుపాకీతో ఐదు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటనలో శరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. 
ఘటన జరిగిన తీరు...
రెస్టారెంట్‌ యజమాని షాహిద్ తెలిపిన వివరాల ప్రకారం రెస్టారెంట్‌లో ఐదుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఓ గుర్తుతెలియని వ్యక్తి లోపలికి వచ్చాడు. అతడిని చూడగానే అక్కడున్నవారంత భయపడ్డారు. ఆ వ్యక్తి వెంటనే గన్‌ బయటికి తీసి అందరినీ బెదిరించాడు. అయితే అతడిని శరత్‌ అడ్డుకున్నాడు. శరత్‌ను యజమాని వారించే సరికి దుండగుడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ వ్యక్తి శరత్‌పై కాల్పులు జరిపాడు. శరత్‌ వెనకవైపు బలంగా తూటాలు తగిలాయి. దీంతో అక్కడే అతడు కుప్ప కూలిపోయాడు. పోలీసులకు కాల్‌ చేసేలోపే దుండగుడు పారిపోయాడు రెస్టారెంట్‌ యజమాని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శరత్‌ మృతి చెందినట్లు స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
శరత్‌ స్వస్థలం కరీమాబాద్‌...
శరత్‌ స్వస్థలం వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌. తండ్రి రామ్మోహన్‌ హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగి. తల్లి మాలతి వరంగల్‌ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో పంచాయతీరాజ్‌ శాఖలో ఈవోఆర్డీగా పనిచేస్తున్నారు. రామ్మోహన్‌.. కుటుంబంతో హైదరాబాద్‌ అమీర్‌పేటలోని ధరంకరం రోడ్డులో నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన శరత్‌ హైదరాబాద్‌లోనే మూడేళ్లపాటు ఉద్యోగం చేశాడు. ఎంఎస్‌ చేసేందుకు ఆరు నెలల కిందట అమెరికా వెళ్లాడు. మిస్సోరి యూనివర్సిటీలో చదువుకుంటూనే కన్సాస్‌ నగరం ప్రాస్పెక్ట్స్‌ అవెన్యూలోని జేఎస్‌ ఫిష్‌ అండ్‌ చికెన్‌ మార్కెట్‌ అనే ఓ హోటల్‌లో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

 

Don't Miss