సీఎం పీఠంపై కన్నేసిన చిన్నమ్మ...

17:27 - January 2, 2017

తమిళనాడు : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన శశికళా నటరాజన్‌ ఇక సీఎం పీఠంపై కన్నేశారా? ప్రస్తుతం తమిళనాట ఇదే అంశం విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. శశికళ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన తరహాలోనే సిఎం పదవిని చేపట్టేందుకు చిన్నమ్మ వర్గం పావులు కదుపుతోంది.

శశికళ పదవి చేపట్టడంపై పార్టీలో కొంత అసంతృప్తి
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ పదవి చేపట్టడంపై పార్టీలో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పలు ప్రాంతాల్లో ఆందోళనలకు దిగిన అసమ్మతివాదులు ఆగ్రహంతో చిన్నమ్మ బ్యానర్లను సైతం చించివేశారు.

శశికళ సిఎం పీఠాన్ని చేపట్టాలనే వాదన
ఈ నేపథ్యంలో శశికళ సిఎం పీఠాన్ని చేపట్టాలనే వాదన బలంగా వినిపిస్తోంది. జయలలిత పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సీఎంగా ఉన్నారని.. అదే తరహాలో అమ్మ వారసురాలిగా శశికళ జోడు పదవులు చేపట్టాలనే డిమాండ్‌ను చిన్నమ్మ వర్గం తెరపైకి తెస్తోంది.

ఆందోళనలో శశికళ వర్గం
త్వరలోనే 'చిన్నమ్మ' సీఎం అవుతారంటూ మంత్రులు ఆర్బీ ఉదయకుమార్‌, కడంబూర్‌ రాజు, చేవూర్‌ రామచంద్రన్‌, తంగమణి, ఓ.ఎస్‌.మణియన్‌లు కూడా వంత పాడుతున్నారు. శశికళను సీఎంగా చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. శశికళకు ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టినందుకే కిందిస్థాయిలో అసంతృప్తి భగ్గుమనడంతో.... చిన్నమ్మకు సీఎం పదవిని అప్పగిస్తే ఎలాంటి వ్యతిరేకత వ్యక్తమవుతుందోనన్న భయాందోళనలో శశికళవర్గం కొట్టుమిట్టాడుతోంది.

జయలలిత మృతితో ఖాళీయైన ఆర్కేనగర్‌
శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే... జయలలిత మృతితో ఖాళీయైన ఆర్కేనగర్‌ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. లేదా విరుదునగర్‌ జిల్లా సాత్తూర్‌ నియోజకవర్గం నుంచి శశికళను సులువుగా గెలిపించవచ్చని ఉదయ్‌కుమార్‌ పావులు కదుపుతున్నారు. మరోవైపు అమ్మ వారసురాలిని అంటూ తెరపైకి వచ్చిన దీప ఇప్పుడు సైలెంట్‌ అయిపోయారు. సరైన సమయంలో శశికళపై సమరం చేయాలని దీప పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 

Don't Miss