ప్రభుత్వ గుర్తింపు లేని ప్రోడక్ట్స్‌ అమ్మకాలు

08:36 - September 10, 2017

ఆదిలాబాద్ : ప్ర్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులపై ఒత్తిడి రోజు రోజుకీ పెరిగిపోతుంది. ట్యూషన్‌లు, అదనపు క్లాసులు అంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు తల్లిదండ్రులు. అంతేకాదు మెదడు చురుగ్గా పని చేస్తుందంటూ వివిధ రకాల లేహ్యాలను పిల్లలతో తినిపిస్తున్నారు. అయితే అవి ఎంత వరకు సురక్షితమో కూడా ఆలోచించడం లేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.  
పిల్లల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న తల్లిదండ్రులు  
ఇరుగుపొరుగు వారి పిల్లలు బాగా చదువుతున్నారు నువ్వెందుకు చదవడంలేదు? పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకొని మా పరువు నిలబెట్టు.. లేకపోతే బంధువుల్లో మేం తలెత్తుకొని తిరగలేం... ఇలా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. మార్కుల కోసం, ర్యాంకుల కోసం పిల్లలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే చదువులో పిల్లలు పరుగులు తీయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. కనీసం పిల్లలకు ఆడుకునే సమయం కూడా ఇవ్వడంలేదు. 
మూఢనమ్మకాలను వదలని తల్లిదండ్రులు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే పిల్లలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో తల్లిదండ్రులు మూఢ నమ్మకాలనూ వదలడం లేదు. కొందరు పూజలు, హోమాలు నిర్వహిస్తుంటే.... మరికొందరు సరస్వతీ లేహ్యం, సరస్వతి ఆకు తినడం వల్ల చదువు బాగా వస్తుందని నమ్ముతున్నారు. పిల్లలు చదువులో రాణించాలని బాసర గుడిలో అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. ఇక తల్లిదండ్రుల నమ్మకాన్ని క్యాష్‌ చేసుకునేందుకు.. బాసరలో వ్యాపారులు మోసపూరిత వ్యాపారానికి తెరతీస్తున్నారు. నకిలీ సరస్వతీ లేహ్యం, బుద్ధి పెరుగుదల కోసం చూర్ణం, సరస్వతీ బీజాక్షర ఆకు అంటూ దేవుడి పేరుమీద వ్యాపారం చేస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ సంస్థల నుండి గుర్తింపు పొందని లేహ్యాలను, ఇతర రకాల మందులను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. 
ఇష్టారీతిగా లేహ్యాలు అమ్మకాలు
అసలు ఈ లేహ్యలు ఎవరు తయారు చేస్తారో, మార్కెట్‌లోకి ఎలా వస్తాయో కూడా తెలియని షాపుల యజమానులు వీటిని ఇష్టారీతిగా అమ్మేస్తున్నారు. వీటిని గురించి ఏ మాత్రం ఆరా తీయకుండానే తల్లిదండ్రులు కొనేస్తున్నారు. అది ఎంత వరకు మంచిదనే విషయం కూడా పట్టించుకోవడం లేదు. 
మందుల పట్ల జాగ్రత్తగా ఉండాలి : డాక్టర్లు 
ఇలాంటి మందుల పట్ల జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. పిల్లల మెదడు చురుగ్గా పని చేయడానికి ఎన్నో పద్దతులున్నాయని ఇలాంటి మందులతో పిల్లల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉందంటున్నారు. 
నకిలీ వ్యాపారులను పట్టించుకోని అధికారులు
మరోవైపు ఇలాంటి నకిలీ వ్యాపారాల పట్ల ఆలయ అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నకిలీ మందులను అంటగడుతూ పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

Don't Miss