ఉత్తరాంధ్రాకు అందమైన అతిథులు..

10:34 - July 2, 2016

శ్రీకాకుళం : సరిహద్దులు దాటుకుంటూ ప్రయాణిస్తాయి...మూడు నెలలు విడిది చేస్తాయి..గుడ్లు పెట్టి పొదిగి..పిల్లలు ఎదిగేదాక ఇక్కడే ఉండి,మళ్లీ తమ దేశాలకు ఎగిరిపోతాయి. ఇది శతాబ్ధాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ... సిక్కోలు స్థానికులకు అదో అనుభూతి...శ్రీకాకుళం జిల్లాలో సందడి చేయడానికి వచ్చేసిన విదేశీ పక్షులపై ప్రత్యేక కథనం..

పక్షుల రాకతోనే వర్షాలు వస్తాయని స్థానికుల నమ్మకం..
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం తేలుకుంచి గ్రామంలో వలసపక్షుల సందడి ప్రారంభమైంది. సరిహద్దును దాటుకుంటూ వచ్చే ఈ అందమైన అతిధుల విహారం స్థానికులను కనువిందు చెయ్యడానికి సిద్ధమైంది. ప్రతి ఏటా జూలైలో సైబీరియా నుంచి వలసవచ్చే ఈ పక్షులను స్థానికులు ఎంతో సంప్రదాయబద్ధంగా చూసుకుంటారు. ఓపెన్ బిల్డ్ స్పార్క్ శాస్త్రీయ నామం గల వీటిని స్థానికులు నత్తగొట్టు పక్షులుగా పిలుచుకుంటారు. జులై మాసంలో వచ్చే ఈ వలస పక్షులు మూడు నెలల పాటు తేలుకుంచి లోనే విడిది చేస్తాయి. ఇవి వస్తే కానీ వర్షాలు కురవవన్న నమ్మకం తో పాటు, ఏటా గుడ్లు పెట్టి పొదిగే సమయం లో ఇక్కడికి సైబీరియా పక్షులు రావడం ఆనవాయితీగా కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు.

పక్షులను అతిధులుగా భావించే స్థానికులు..
ఈ పక్షులు తూర్పు, దక్షిణ ఆసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశం, శ్రీలంక మొదలుకొని తూర్పు ప్రాతంలో విస్తారంగా సంచరిస్తుంటాయి. ఈ సీజన్ ఈ తేలుకుంచి చేరుకుని ఇక్కడి చెట్లపై జూలై నుంచి జనవరి వరకు నివాసం ఉండి తరువాత వెళ్లిపోతాయి. ప్రతి సంవత్సరం ఈ సీజన్‌లో పక్షులను చూడటానికి వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. ఈ పక్షుల రాక, తమ తాత ముత్త్తాతల నుంచి జరుగుతోందని .... అప్పటి నుంచి వీటిని తమ ఊరుకు వచ్చే అతిధుల్లా భావిస్తామని గ్రామస్థులు అంటున్నారు.

సెప్టెంబర్ మొదటి వారం లో తిరుగుప్రయాణం ...
ప్రతి ఏడాది జూలై నెలలో వచ్చి సెప్టెంబర్ మొదటి వారం లో తిరుగుప్రయాణం అవుతుంటాయి వలస పక్షులు. తేలుకుంచి లో గల వలసపక్షుల విడిది కేంద్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే.. సందర్శకులూ వస్తారు, తమకు ఆనందంగా ఉంటుందని గ్రామస్థులు అంటున్నారు. అటవీశాఖ అధికారులు ఆ విధంగా ఆలోచించాలని సూచిస్తున్నారు.

Don't Miss