'సిద్ధార్థ' రివ్యూ..

18:25 - September 16, 2016

మొగలిరేకులు సీరియల్ లోని ఆర్ కె నాయుడు పాత్రతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సాగర్ , వెండితెరమీద హీరో గా చేసిన తొలి ప్రయత్నమే 'సిద్ధార్ధ'. 'సాక్షి చౌదరి', 'రాగిణి ద్వివేది' తారాగణంతో దయానంద రెడ్డి డైరెక్ట్ చేసిన యాక్షన్ లవ్ స్టోరీ 'సిద్ధార్ధ'. బుల్లి తెరమీద చేసినంత ఎఫెక్టివ్ గా వెండితెరమీద చేసాడా? అసలు ఈ సినిమా కథా, కమామిషు ఏంటో తెలుసుకోవాలంటే చదవండి.. టివి నటులు బిగ్ స్ర్కీన్ మీదకు అడుగుపెడితే ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. అదే టైమింగ్. టీవి సీరియల్ లో సావకాశంగా నటించొచ్చు. అది పూర్తిగా విజువల్ ఓరియెంటెడ్ . అదే సినిమా దగ్గరకొచ్చేసరికి ఇది పూర్తిగా విజువల్ ప్లస్ డైలాగ్ ఓరియెంటెడ్ . వీలైనన్ని హావభావాలన్నీ ఒకేసారి చూపిచేయాల్సి వస్తుంది. అందుకే చాలా మంది టీవి నటులు హీరోలుగా రాణించలేకపోయారు. సాగర్ కూడా దీనికి మినహాయింపేమీకాదు. ఒకటే ఎక్స్ ప్రెషన్. సినిమా కూడా సీరియల్ కి ఏ మాత్రం తీసిపోని నెరేషన్ తో జనం సహనానికి పెద్ద పరీక్ష పెట్టింది. చెప్పుకోడానికి ఇందులో కొత్తదనమేమీలేదు. రొటీన్ కథ, రొటీన్ సన్నివేశాలు. స్టార్ డైరెక్టర్లందరూ ఎప్పుడో వాడేసిన పాతచింతకాయ పచ్చడి లాంటి కక్షలు, గొడవలు నేపధ్యంలో సాగుతుంది సినిమా. అలాగని పూర్తిగా అదే టింట్ లో ఉండదు. ఆ బ్యాక్ డ్రాప్ లో ఓ లవ్ స్టోరీ. ఈ సినిమా వల్ల 'సాగర్' కి పెద్దగా ఒరిగేదేమీ లేదు. టోటల్ గా 'సిద్ధార్ధ' సినిమా ఓ వృధాప్రయత్నం అని చెప్పుకోవాలి.

కథ..
ఊరిజనం కోసం మైనింగ్ కాంట్రాక్ట్ ను ప్రతి సంవత్సరం పాడుకుని అందులో మైనింగ్ ఏమీ చేయకుండా ఊరికి ఉపకారం చేస్తుంటాడు హీరో తండ్రి. అది గిట్టని వారు అతడ్ని హత్య చేస్తారు. దానికి బదులుగా తన తండ్రిని హత్యచేసిన వాడ్ని హత్య చేస్తాడు హీరో సూర్య. తల్లికిచ్చిన మాటకోసం ఊరిగొడవలకు దూరంగా మలేసియా వెళ్లిపోతాడు హీరో. అక్కడ 'సిద్ధార్ధ' అని పేరు మార్చుకొని కొత్త ఐడెంటిటీతో కొన్నాళ్లు గడుపుతాడు. ఈ ప్రయాణంలో అతడికి సహస్ర అనే ఒక అమ్మాయి పరిచయమౌతుంది. ఇంతలో ఆ ఊరినుంచి 'సిద్ధార్ధ'కు రాజీ పిలుపొస్తుంది. గొడవలు మానేసి రెండు వర్గాలు ఊరికోసం సంతోషంగా ఉందామని ప్రపోజల్ వస్తుంది సిద్ధార్ధకు. అలాగే వాళ్ల ఇంటి అమ్మాయిని పెళ్లిచేసుకోమని షరతులు కూడా విధిస్తారు. ఊరిజనం కోసం తన ప్రేమను చంపుకొని పెళ్లికి సిద్ధపడతాడు సూర్య. మరి సూర్యను మలేసియా లో ప్రేమించిన సహస్ర దీనికి ఎలా రియాక్ట్ అయింది? చివరికి కథ ఏ రూట్లో ప్రయాణించిందన్నదే మిగతా కథ.

పాత్రల తీరుతెన్నులు..
ఈ సినిమాలో చెప్పుకోదగ్గ నటనను ప్రదర్శించిన వాళ్లెవరూ లేకపోవడం విడ్డూరం. సీరియల్స్ లో క్రేజ్ వచ్చినంత మాత్రాన సినిమాలో కూడా సాగర్ కి క్రేజ్ వస్తుందనుకోవడం పొరపాటు. ఏ విధంగానూ ఇందులో సాగర్ కొత్తదనం చూపించలేకపోయాడు. అలాగే మిగిలిన పాత్రధారులు కూడా రొటీన్ నటననే ప్రదర్శించారు. అజయ్, సుబ్బరాజులు తమకు బాగా అలవాటైన హావభావాలే ప్రదర్శించారు. కోట శ్రీనివాసరావు యాజ్ యూజువల్ గా పెద్ద మనిషి వేషం వేసారు. ఇక సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ప్రభాస్ శ్రీను లు కాస్త నవ్వించడానికి ప్రయత్నించారు. వాళ్ల సీన్స్ దగ్గరే జనం కొంచెం రిలాక్స్ అవుతారు. మణిశర్మ సంగీతం కూడా అంత గొప్పగా అనిపించదు, అలాగే యస్.,గోపాలరెడ్డి కెమెరా తో కూడా పెద్దగా అద్భుతాలేమీ చూపించలేదు. జస్ట్ మామూలు రొటీన్ సినిమాగా చేయడానికి మాత్రమే ఈ సీనియర్ టెక్నీషియన్స్ మిగిలారు. డైరెక్టర్ గా పరిచయమైన దయానంద రెడ్డి కూడా కొత్తదనమేమీ చూపించలేకపోయాడు. ఆయన అనుభవ రాహిత్యం రొటీన్ నెరేషన్ లోనే కనిపిస్తుంది. సో.. టోటల్ గా సాగర్ వెండితెర ఎంట్రీ జనాన్ని తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా అతడి సీరియల్ అభిమానులకి.

ప్లస్ పాయింట్స్ :
కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ, కథనాలు
స్లో నెరేషన్
మ్యూజిక్
కొత్తదనం లేకపోవడం
రేటింగ్ : 1/5

Don't Miss