ఇంజినీరింగ్ కాలేజీలో సోలార్ విద్యుత్...

12:39 - February 14, 2018

విజయవాడ : ఏపీలో సోలార్ విద్యుత్‌కి డిమాండ్ పెరుగుతోంది. విద్యాసంస్థలు.. వ్యాపార సముదాయాలు సైతం ఇప్పుడు సోలార్‌ పవర్‌పై దృష్టి పెట్టాయి. విజయవాడలో అతి పెద్ద విద్యాసంస్థల్లో ఒకటైన సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రయోగాత్మకంగా 150 వాట్స్ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ప్రారంభించింది.

విజయవాడ నగరంలోని సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజ్‌ ఇది... ఈ కాలేజ్‌ ప్రాంగణంలో 10 వేల చదరపు అడుగులతో కూడిన భవన సముదాయాలు ఉన్నాయి. నిత్యం ఈ కాలేజ్‌లో 500 వాట్ల విద్యుత్‌శక్తిని వినియోగిస్తున్నారు. విద్యుత్ సంస్ధ బిల్లులు మోత మోగిస్తుండటంతో ఆ భారం నుంచి బయటపడేందుకు సోలార్ విద్యుత్ ఒకటే పరిష్కారమని కళాశాల అధ్యాపకులు భావించారు. ఈ విషయాన్ని పాలకవర్గం కూడా అంగీకరించడంతో ప్రయోగాత్మకంగా సోలార్‌ విద్యుత్ పవర్‌ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. దీనిని ప్రముఖ వ్యాపార వేత్త మలినేని రాజయ్య ప్రారంభించారు.

సోలార్ పవర్ ప్లాంట్‌ ఏర్పాటుకు కళాశాల పాలకవర్గం రూ.50 లక్షలు ఖర్చు పెట్టింది. దీనికి నెడ్ క్యాప్ 30శాతం సబ్సిడీ కూడా తోడవ్వటంతో ఇందులో అనుభవం ఉన్న సాఫ్ట్‌ టెక్‌ సంస్థను సంప్రదించారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడంతో పాటు తక్కువ ఖర్చుకి సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుండటంతో ఇది అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో అనేక సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను చేపట్టిన సాఫ్ట్ టెక్ సంస్ధ స్వల్పకాలంలోనే కళాశాలలో తొలివిడతగా 150 వాట్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఖాళీగా ఉన్న కళాశాల భవనాల పై అంతస్ధుల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్యానల్స్ ఏర్పాటు చేశారు. అటు ప్రభుత్వం కూడా దీనిని మరింతగా ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని కళాశాల సిబ్బంది సూచిస్తున్నారు. 

Don't Miss