వెండి గోళీల కోసం పరుగులు...

15:18 - May 18, 2017

ఎక్కడైనా రోడ్డుపై వెండి గోళీలు కనబడితే ఏం చేస్తారు.. ? ఇంకే చేస్తాం చక్కగా ఏరుకుని జేబులో వేసుకుంటాం..అంటారా..ఇలాగే చేశారు. ఓ ప్రాంతలోని రోడ్డుపై వెండి గోళీలు పడడంతో వాటిని ఏరుకొనేందుకు జనాలు తండోపతండాలుగా రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేయలేక పోలీసులకు తల ప్రాణం తోకకొచ్చింది. ఈఘటన పశ్చిమ బెంగాల్ లోని భాంగర్ లో చోటు చేసుకుంది. మే 16వ తేదీ ఉదయం ఓ వ్యాపారి ద్విచక్రవాహనంపై ఐదు కిలోల వెండి గోళీలున్న బ్యాగును తీసుకెళుతున్నాడు. హఠాత్తుగా ఆ బ్యాగుకు రంధ్రం పడిపోవడం..వెండి గోళీలు రోడ్డుపై పడిపోవడం జరిగిపోయాయి. అక్కడనే ఉన్న స్థానికులు దీనిని గమనించి వెండి గోళీలను తీసుకొనేందుకు పరుగులు తీశారు. దీనితో ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న వ్యాపారి వెనక్కి తిరిగి వచ్చాడు. కానీ అప్పటికే ప్రజలు వెండి గోళీలను తీసుకుని వెళ్లిపోయారు. 2 లక్షల 25 వేల రూపాయల సొమ్ము నేలపాలు కావడంతో ఆ వ్యాపారి లబోదిబోమన్నాడంట. ఎవరెవరు, ఎంత వెండి తీసుకెళ్లారో కనుక్కొని, తిరిగి స్వాధీనం చేసుకోవడం పోలీసులకు కష్టమైన పనే. పోలీసులు 300 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకోగలిగారు.

Don't Miss