ముగిసిన సింధూ ప్రయాణం..

07:35 - December 18, 2016

బ్యాడ్మింటన్ వరల్డ్‌ సూపర్ సిరీస్‌ ఫైనల్స్‌‌ టోర్నీలో తెలుగు తేజం, ఏస్ షట్లర్ పీవీ సింధూ ప్రయాణం ముగిసింది. సెమీఫైనల్లో సింధూను సౌత్ కొరియా క్రీడాకారిణి సంగ్ జు హ్యూన్ ఓడించి ఫైనల్లో ప్రవేశించింది. తొలిసారి బ్యాడ్మింటన్‌ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో ఆడుతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తడబడింది. ఇక్కడ నేటి రాత్రి జరిగిన సెమిఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన షట్లర్ సుంగ్‌ జీ హున్‌ చేతిలో 15-21, 21-18, 15-21 తేడాతో సింధు ఓటమిపాలైంది. గ్రూపు-బీ నుంచి రెండు విజయాలతో సెమిఫైనల్స్ చేరుకున్న సింధుకు నిరాశే ఎదురైంది.

రెండో గేమ్‌లో పుంజుకున్న సింధు..
మ్యాచ్‌ సాంతం హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌లో ఆధిక్యం పదేపదే చేతులు మారింది. నువ్వానేనా అన్నట్లు సాగిన గేమ్‌లో సంగ్‌హ్యూన్‌.. సింధును కోర్టుకు ఇరువైపులా తిప్పించి 21-15తో విజయం పొందింది. అయితే కీలకమైన రెండో గేమ్‌లో సింధు పుంజుకొంది. 10-10, 14-14, 18-18తో సమం చేస్తూ ప్రత్యర్థి ప్రతిఘటించినా అద్భుత స్మాష్‌లతో 21-18తో రెండో గేమ్‌ గెలుచుకొంది. మూడో గేమ్‌లోనూ ఇద్దరూ పోటాపోటీగా ఆడినా సింధు కొన్ని అనవసర తప్పిదాలు చేయడంతో హ్యూన్‌ 21-15తో మ్యాచ్‌ గెలిచి ఫైనల్‌కు చేరుకొంది. సింధుపై తన గెలుపోటముల రికార్డును 4-6కు మెరుగు పర్చుకుంది. సెమీఫైనల్‌కు ముందు మ్యాచ్‌లో టాప్ ప్లేయర్ కరోలినా మరిన్ ఓడించింది సింధూ. రియో ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్‌లో కరోలినా చేతిలో ఓడినందుకు ఈ సూపర్ సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకుంది. ఇటీవల జరిగిన హాంగ్‌కాంగ్, చైనా ఇప్పుడు డీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్‌లలో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది పీవీ సింధూ.

Don't Miss