ఓపెన్‌ కాస్ట్‌ పేరుతో.. గిరిపుత్రుల జీవితాలలో అలజడి

20:19 - July 25, 2017

ఆదిలాబాద్ : అవి గిరిజన పల్లెలు. పచ్చని చేలు.. జల జల జారే జలపాతాలు.. అందమైన అడవి.. స్వచ్ఛమైన సంస్కృతికి నిలువెత్తు రూపాలు. వాళ్లకు మోసపోవడం తప్ప, మోసం చేయడం అంటే ఏంటో తెలీదు. వ్యవసాయం, అడవి తల్లే జీవనాధారంగా తరతరాల సంప్రదాయాలను కాపాడుకుంటున్నారు. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం ఓపెన్‌ కాస్ట్‌ పేరుతో.. గిరి పుత్రుల జీవితాలలో అలజడిని, అశాంతిని రాజేస్తున్నాయి. దీనిపై 10టీవీ ప్రత్యేక కథనం. 
ఓపెన్‌ కాస్ట్‌తో కనిపించకుండాపోనున్న సోనాపూర్ 
సోనాపూర్‌.. ఈ గిరిజన పల్లె మరి కొన్నేళ్లలో మనకు కనపించకుండా పోనుంది. గిరిజనులు చెట్టుకొకరు, పుట్టకొకరు చీలిపోయే దీన పరిస్థితి దాపరించబోతోంది. బెల్లంపల్లి ఓపెన్‌ కాస్ట్‌తో ఇక్కడి గిరిజన సంప్రదాయం కనుమరుగు కానుంది. గిరిజనుల రక్షణ కోసం, వారి బతుకులను, సంస్కృతిని కాపాడేందుకు ఎన్నో షెడ్యూళ్లు, చట్టాలు, క్లాజులు, జీవోలు ఉన్నా.. సింగరేణి యాజమాన్యానికి, ప్రభుత్వాలు, పార్టీలకు ఇవేమీ కనిపించడం లేదు.  
బలవంతంగా భూ సేకరణ 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా, ప్రస్తుత ఆసిఫాబాద్‌ జిల్లాలోని సోనాపూర్‌లో.. ఓపెన్ కాస్ట్‌ పేరుతో మైనింగ్ చేస్తున్నారు. గిరిజనులు రక్షణ కోసం రాజ్యాంగంలో 5, 6 షెడ్యూళ్లు, 1/70 చట్టం, 2013 భూ సేకరణ చట్టం, 34 జీవో, 2005 అటవీ హక్కుల చట్టం, ఎస్‌టీ సబ్‌ప్లాన్‌ వంటివి ఉన్నా వీటన్నింటినీ కాదని బలవంతపు భూ సేకరణ ప్రారంభించారు. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం గిరిజనులను పోలీసులు, నిర్భందాలు, అబద్దపు ప్రచారాలతో భయపెట్టాలని చూస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం గిరిజన గ్రామాల్లో ఏ ప్రాజెక్ట్‌ అయినా ఏర్పాటు చేయాలంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. గ్రామ సభలు నిర్వహించి, తీర్మానాలు చేయించి గిరిజనులు ఒప్పుకుంటేనే భూసేకరణ చేయాలి. 
గిరిజన సంస్కృతిని నాశనం చేస్తున్నారు 
ఆదిలాబాద్ జిల్లా, బొగ్గు ఖనిజాలకు పుట్టినిల్లు. భూ గర్భంలోని బొగ్గును వెలికి తీయడానికి ఓపెన్‌ కాస్ట్‌లే పరిష్కారం కాదు. గతంలోనూ మనుషులను ఉపయోగించి అండర్‌ గ్రౌండ్‌ సిస్టం ద్వారా బొగ్గును వెలికి తీశారు. ఇదే అసలు మొదటి పద్ధతి. బొగ్గును తీసిన బావులే భూగర్భగనుల వలన ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. గ్రామాలను ఖాళీ చేయించడం, అడవులను, వ్యవసాయాన్ని నాశనం చేయడం, గిరిజన సంస్కృతిని నాశనం చేయడం, పర్యావరణం వంటి సమస్యలు లేకుండానే బొగ్గును వెలికి తీయవచ్చు. 
సీఎంపై మండిపడుతున్న గిరిజన సంఘాలు 
ప్రజలకు నష్టం జరిగేలా యాజమాన్యం పాలకుల వ్యవహార శైలి ఉంది. యంత్రాలు ఉపయోగించి, బహుళ జాతి సంస్థల కోసం, కాంట్రాక్టర్ల కోసం ఓపెన్‌ కాస్ట్‌ను  ఉపయోగించుకున్నాయి. తెలంగాణ పోరాట సమయంలో ప్రస్తుత సీఎం కేసీఆర్‌ ఓపెన్‌ కాస్ట్‌ వద్దని, గిరిజన బతుకులు నాశనమవుతున్నాయని, భూ సేకరణ కూడా చట్ట విరుద్ధంగా జరుగుతోందని చెప్పారు. తెలంగాణ వచ్చి అధికారం వచ్చాక రూట్‌ మార్చారు. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేలా కేసీఆర్‌ పాలన ఉందని, గిరిజన వ్యతిరేఖ విధానాలను అవలంభిస్తున్నారని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గురించి ఆలోచించి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

 

Don't Miss