సిరిసిల్లలో మట్టి వినాయకుడు

10:16 - September 4, 2017

సిరిసిల్ల : సిరిసిల్ల వాసులు మట్టి వినాయకుడే శ్రేష్టమంటున్నారు. పర్యావరణానికి చేటుచేసే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలు మాకొద్దంటున్నారు. ఇంతింతై వటువింతై అన్న చందంగా..ఏటీకేడు నగరంలో మట్టివినాయకుల సంఖ్య పెరగడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. విజ్ఞాలు తీర్చే గణపయ్యను..తమ సమస్యలు తీర్చాలంటూ వినూత్నంగా కొలుస్తున్నారు.     

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పర్యావరణ హిత వినాయకులను పూజిస్తూ తరిస్తున్నారు. మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడంలో ఇతరులకు ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. నగరంలో ఈ ఏడాది సుమారు 15 మట్టి గణపయ్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. 

సిరిసిల్ల అనంతనగర్‌లో హిందూ సేవక్‌ సమితి ఆధ్వర్యంలో ఐదేళ్లుగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తున్నారు. గతేడాది నేతన్న రూపంలో మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణపయ్యకు విశేష పూజలు నిర్వహించారు. నేతన్న రూపంలో పూజించడం వల్లనే తమకు చేతి నిండా పని దొరికిందని చేనేత కార్మికులు భావించారు. ఆ నమ్మకంతోనే ఈ ఏడాది తమకు మేలు జరగాలని రైతు రూపంలో లంబోదరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. 


ఎలాంటి హానికరమైన రంగులు వాడకుండా మట్టితో భారీ వినాయక విగ్రహాలను తయారు చేయొచ్చని హిందూ సేవక్‌ సమితి సభ్యులు చెబుతున్నారు. అనాదిగా మట్టి గణపయ్య విగ్రహాలను పూజించడం ఆచారంగా వస్తోందని చెప్పుకొస్తున్నారు. మట్టి వినాయకుడిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయంటున్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ కన్నా మట్టి గణపయ్యను ఇళ్లలో ప్రతిష్టించాలని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామంటున్నారు విద్యావేత్తలు.  

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఓవైపు పూజలు.. మరోవైపు ఆటపాటలతో సరదాగా గడుపుతున్నామని స్థానిక మహిళలు చెబుతున్నారు. మండపాల్లో ఐక్యంగా వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందంటున్నారు. 

సిరిసిల్ల వాసులు ఏటా మట్టి వినాయకులను వైవిద్యమైన రూపాల్లో తయారు చేస్తున్నారు. పర్యావరణ ప్రియ గణపయ్యే తమ కష్టాలు తీర్చే కల్పతరువుగా భావిస్తున్నారు.   

 

Don't Miss