అధికార పార్టీ నేతలు..ఇది తగునా ?

07:11 - April 4, 2018

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో అధికారపార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. అమాయకులైన రైతుల భూములను లాగేసుకుంటున్నారు. వడ్డీకి డబ్బులు ఇవ్వడం.. వాటిపై చక్రవడ్డీ, బారువడ్డీల పేరుతో డబ్బులు గుంజడం.... కట్టలేని వారి నుంచి భూములు లాగేసుకోవడం ఇక్కడి నేతలకు పరిపాటిగా మారింది. అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ రైతులకు డబ్బులిచ్చిన గులాబీ నేత... ఆ రైతుకు తెలియకుండానే అతని భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఘటన సిరిసిల్ల జిల్లాలోవెలుగు చూసింది.

ఎక్కల్‌దేవి సాయిలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలోని కొండాపూర్‌ స్వగ్రామం. కొన్నాళ్లుగా సాయిలు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సాయిలు కాలేయం దెబ్బతింది. ఆసుపత్రిలో చూపించుకుంటే భారీగా ఖర్చవుతుందని సూచించారు. తన దగ్గర అంత డబ్బులేకపోవడంతో ఫైనాన్స్‌ వ్యాపారి అయిన మురళీమోహన్‌ను ఆశ్రయించాడు. లక్ష రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... అసలు కథ ఇక్కడే మొదలైంది.

బొల్లి మురళీమోహన్‌ సోదరుడైన బొల్లి రాంమోహన్‌ అధికారపార్టీకి చెందిన నాయకుడు. రాంమోహన్‌కు టీఆర్‌ఎస్‌లోని యువమంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అన్న రాజకీయ పలుకుబడిని ఆసరా చేసుకున్న బొల్లి మురళీమోహన్‌ అనేక అక్రమాలకు తెగబడుతున్నాడు. సాయిలు తీసుకున్న లక్ష రూపాయల అప్పుకింద అతని భూమిని లాగేసుకోవాలని ప్లాన్‌ చేశాడు. సాయిలుకుగానీ.. అతని కుటుంబ సభ్యులకుగానీ తెలియకుండా 56 గుంటల భూమి తనపేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు.

తెలంగాణ ప్రభుత్వం రైతుల భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు చేపట్టిన భూసర్వేలో సాయిలు పేరు లేకపోవడంతో బొల్లి మురళీమోహన్‌ అక్రమాల చిట్టా బయటపడింది. దీంతో సాయిలు కుటుంబ సభ్యులు మురళీమోహన్‌ను నిలదీశారు. దీంతో మరికొన్ని డబ్బులు ఇస్తానంటూ నమ్మబలికాడు. అప్పటి నుంచి రేపుమాపు అంటూ తిప్పుకుంటున్నాడు తప్పా డబ్బులు ఇవ్వడం లేదని సాయిలు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుగా లక్ష రూపాయలు ఇచ్చి తమ భూమిని మురళీమోహన్‌ అక్రమంగా లాగేసుకున్నాడని సాయిలు వారు ఆరోపిస్తున్నారు.

బొల్లి మురళీమోహన్‌ ఇంటిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకపోవడంతో సాయిలు కుటుంబ సభ్యులు అతడి ఇంటిముందు బైఠాయించారు. మీడియా కూడా అక్కడికి చేరుకోవడంతో సమస్య పరిష్కరించుకుందామంటూ మురళీమోహన్‌ సోదరుడు బొల్లి రాంమోహన్‌ అక్కడి నుంచి వారిని తరలించి మెల్లిగా జారుకున్నాడు. తమకు న్యాయం చేయకపోతే మురళీమోహన్‌ ఇంటి ముందు దీక్షకు దిగుతామని బాధితులు తేల్చి చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Don't Miss