పేదలకు ఆపన్నహస్తం అందిస్తున్న ఎమ్మెల్యే కోనప్ప

17:51 - January 31, 2018

అసిఫాబాద్ : పేదలను ఆదుకోవడంలో ఆ ప్రజాప్రతినిధి అందరికంటే ముందుంటారు. నిస్సహాయకులను సాయం చేయడంలో ఆయనది పెద్దచేయి. కరవు రోజుల్లో గిరిజన గూడేల్లో అంబలి కేంద్రాలు తెరిచి ఆదుకున్న ఆ ఎమ్మెల్యే...  ఇప్పుడు 58 గిరిజన జంటలకు సొంత ఖర్చులతో సామూహిక వివాహాలు జరిపించి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

ఈయన పేరు కోనేరు కోనప్ప. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే. పేదలకు ఆపన్నహస్తం అందించడంలో ఘనాపాటి. గతంలో పలు ధాతృత్వ కార్యక్రమాలు నిర్వహించిన ఈయన ఇప్పుడూ ఇదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. బెజ్జూరు మండలం సోమిని గ్రామంలో గిరిజన జంటలకు సామూహిక వివాహం జరిపించారు. 

ఒకటికాదు.. రెండుకాదు... 58 ఆదివాసీ గిరిజన జంటలకు పెళ్లి జరిపించారు. వీరిలో కోయ, కోలాం, మన్నె తెగలకు చెందినవారు ఉన్నారు. తలంబ్రాల నుంచి తాంబూల వరకు అన్నింటికీ సొంతంగా ఖర్చులు పెట్టుకున్నారు. తాళిబొట్టు, పట్టు వస్త్రాలు, ఇంటి సామాగ్రి అందచేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ కోనేరు చారిటబుల్‌ ట్రస్టు తరపున విందు భోజనాలు ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే కోనప్ప దంపతులతోపాటు మంత్రి జోగురామన్న, పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వీరిందరికి కల్యాణ లక్ష్మి పథకం కింద ప్రభుత్వ సాయం అందేవిధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

పేద గిరిజనులకు సామూహిక వివాహాలు జరిపించిన కోనేరు కోనప్పను పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు, గిరిజన సంఘాల నాయకులు అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తర్వలో సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌లో పర్యటించనున్నారు. ఆ సందర్భంలో 116 పేదల జంటలకు పెళ్లిల్లు జరిపించాలని నిర్ణయించారు. 

 

Don't Miss