ఏచూరి గేయం..సభలో చప్పట్లు..

06:51 - August 10, 2017

ఢిల్లీ : క్విట్‌ ఇండియా ఉద్యమం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం జరిగింది. దేశ స్వాతంత్ర్యంలో క్విట్‌ ఇండియా ఉద్యమం నిర్వహించిన పాత్రను అధికార విపక్షాలు నెమరేసుకున్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక, మతతత్వ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశాయి. 1942లో జరిగిన ఉద్యమం దేశ స్వాతంత్ర పోరాటాల్లో అతి పెద్దదని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. దేశ స్వాతంత్రం కోసం క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మా గాంధీ `కరో యా మరో' నినాదమిచ్చారని...దీంతో చిన్నా...పెద్దా అంతా ఏకమయ్యారని తెలిపారు. స్వాత్రంత్య పోరాటంలో గాంధీజీ సహా ఎందరో నాయకులు జైలు జీవితం గడిపారని...ఎన్నో బలిదానాలు జరిగాయని చెప్పారు. ఆనాటి జాతీయ నేతలను స్ఫూర్తిగా తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి అవినీతి అడ్డుకట్టగా మారిందని మోది అభిప్రాయపడ్డారు.

లోక్ సభలో..
లోక్‌సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పరోక్షంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై ధ్వజమెత్తారు. దేశంలో చీకటి శక్తులు మళ్లీ పైకి లేస్తున్నాయని మండిపడ్డారు. లౌకిక, ఉదారవాద, స్వేచ్ఛాయుత ఆలోచనాధారకు ముప్పు వాటిల్లుతోందని... ప్రస్తుతం దేశంలో భయాందోళన వాతావరణం నెలకొందని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛా స్వాతంత్రాన్ని పరిరక్షించాలంటే క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తిగా చట్టవ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని సోనియా పిలుపునిచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని కొన్ని గ్రూపులు వ్యతిరేకించాయంటూ పరోక్షంగా ఆర్‌ఎస్‌ఎస్‌ను వేలెత్తిచూపారు.

ఏచూరి గేయం..
దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక, మతతత్వ పరిస్తితులపై రాజ్యసభలో సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఆనాడు బ్రిటిష్‌వాళ్లను వెళ్లగొట్టడానికి క్విట్‌ ఇండియా నినాదమిస్తే...ప్రస్తుతం అమలవుతున్న ఆర్థిక విధానాలను ఇండియా నుంచి పారదోలాలన్నారు. పేదలు, ధనికుల మధ్య అంతరం రోజు రోజుకు పెరిగిపోతోందన్నారు. కొన్ని శక్తులు దేశంలో మతపరంగా ప్రజలను రెండుగా విడదీయాలని చూస్తున్నాయని... దేశాన్ని మరోసారి ఇండియా, పాకిస్తాన్‌లుగా విడగొట్టవద్దని ఏచూరి హెచ్చరించారు. ఈ సందర్భంగా మతసామరస్యంపై ఏచూరి ఓ గేయాన్ని వినిపించారు. బ్రిటిష్‌ వాళ్లకు వ్యతిరేకంగా 1857లో జరిగిన ఉద్యమంలో అగ్రవర్ణాలు దళితులు, మైనారీటీలు అన్న తేడా లేకుండా దేశం కోసం అందరూ సమైక్యంగా పోరాడారని ఏచూరి గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో క్విట్‌ ఇండియా నిర్వహించిన భూమికను ఈ సందర్భంగా పార్లమెంట్‌ ఉభయ సభల సభ్యులు మరోసారి గుర్తు చేసుకున్నారు.

Don't Miss