వేధింపులు..రైల్లో నుండి దూకిన యువతి..

06:39 - September 1, 2017

ప్రకాశం : పెళ్లిచూపుల కోసం బయలు దేరింది. మరికొన్ని గంటల్లో సొంతూరుకు చేరుకుంటానని ఎదురు చూస్తున్న యువతి పట్ల కొందరు యువకులు యమదూతల్లా ప్రవర్తించారు. వెకిలి మాటలు, చేష్టలతో విసుగెత్తించారు. పోకిరీల వేధింపులను తప్పించుకోడానికి కదులు తున్న రైల్లోనుంచి దూకేసింది. తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో జరిగన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

విజయవాడకు చెందిన యువతి షేక్‌ అజ్ములా చెన్నైల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తోంది. కాగా తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన పెళ్లిచూపుల కోసం సొంతూరుకు బయలు దేరింది. స్నేహితురాళ్లతో సంతోషంగా నిజమాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కిన అమ్మాయిలకు ఉత్తర భారత్‌కు చెందిన కొందరు యువకులు మాటలు, చేష్టలతో నరకం చూపెట్టారు. పోకిరీల వేధింపులకు తాళలేక అజ్ములా రైల్లోనుంచి దూకేసింది. అజ్ములా స్నేహితురాళ్లతోపాటు అదే ట్రైన్‌లో ఎక్కిన యువకులు ఫుల్‌గా మద్యం సేవించి ఉన్నారు. అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. దీంతో ప్రకాశం జిల్లా సింగరాయ కొండ రైల్వేస్టేషన్‌ దగ్గరకు రాగానే అజ్ముల్‌ ఒక్కసారిగా బయటికి దూకేసిందని ఆమే స్నేహితురాళ్లు తెలిపారు. వెంటనే స్పందించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన ఆజ్ముల్‌ను తిరుపతిలోని రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అజ్ముల్‌కు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి ఆందోళన కరంగానే ఉందని డాక్టర్లు తెలిపారు. అటు పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన కూతురి కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు.. విషయం తెలుసుకుని షాక్‌కు గురైయ్యారు. అటు అజ్ముల్‌ ఆమె స్నేహితులతో అనుచితంగా ప్రవర్తించిన యువకులను విజయవాడ రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోకిరీలను కఠినంగా శిక్షించాలని అజ్ముల్‌ తల్లిదండ్రులు కోరుతున్నారు.

Don't Miss