కరవు సీమలో ద.కొరియా విద్యార్థుల సేవా కార్యక్రమాలు

09:56 - February 6, 2018

అనంతపురం : ఎక్కడో దేశం కాని దేశం. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, ఆచార వ్యవహారాలు వేరు. విభిన్నవాతావరణ పరిస్థితులు. కూల్‌  కంట్రీ నుంచి హాట్‌ ఇండియాకు వచ్చారు. ఏపీలోని కరవు సీమలో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అనంతపురం జిల్లాలోని పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్న దక్షిణ కొరియా విద్యార్థులపై 10 టీవీ ప్రత్యేక కథనం. 
కియా మోటార్స్‌ సామాజిక కార్యక్రమాలు 
వీరంతా దక్షిణ కొరియా విద్యార్థులు. అనంతపురం జిల్లా పెనుకొండలో నిర్మాణంలో ఉన్న దక్షిణ కొరియా కార్ల దిగ్గజ సంస్థ కియా మోటార్స్‌...  కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా వీరిని ఇక్కడకు తీసుకొచ్చింది. జిల్లాలోని పాఠశాలల్లో సేవలు చేస్తున్నారు. 
గత నెల 29న ప్రారంభమైన సేవా కార్యక్రమాలు 
గత నెల 29 ప్రారంభమైన దక్షిణ కొరియా విద్యార్థుల సేవా కార్యక్రమాలు ఈనెల 7 వరకు కొనసాగుతాయి. మొత్తం నాలుగుటీములగా ఏర్పడి దక్షిణ కొరియా విద్యార్థులు రాప్తాడు, పెనుకొండ  స్కూళ్లలో మరుగుదొడ్లు, ప్రహరీగోడల నిర్మాణం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇసుక జల్లించడం నుంచి సిమెంటు కలపడం వరకు అన్ని పనులు చేస్తున్నారు. విద్యార్థులకు మరుగుదొడ్ల ఆవశ్యకత, వ్యక్తిగత పరిశుభ్రత గురించి బోధిస్తున్నారు.  ఆట, పాటలు నేర్పిస్తున్నారు. సాంస్కృతి కార్యక్రమాలతో అలరిస్తున్నారు.  భారత్‌లో ఎండ, వేడిమి అధికంగా ఉన్నా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందని కొరియా విద్యార్థులు చెబుతున్నారు. 
విద్యార్థులకు జేఎన్‌టీయూ ఎస్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్ల సహకారం 
అనంతపురంలోని జేఎన్‌టీయూ ఎస్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు దక్షిణ కొరియా విద్యార్థులకు సహకరిస్తున్నారు. అందరూ కలిసిమెలిసి పనిచేస్తున్నారు. బెంగళూరు కేంద్రగా పనిచేస్తున్న ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఇండియా భాగస్వామ్యంలో కియా మోటార్స్‌ జిల్లాలోని స్కూళల్లో వంట గదుల ఆధునీకరణ వంటి కార్యక్రమాలు చేపట్టింది. ఈనెల 7న వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సమక్షంలో దక్షిణ కొరియా, భారత్‌ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. 

Don't Miss