నగర తాగునీటి కష్టాల చెక్‌కు జలమండలి ప్రయత్నం

17:34 - March 7, 2017

హైదరాబాద్: ఎండాకాలం వచ్చిందంటే హైదరాబాద్ నగరవాసులకు తాగునీటి కష్టాలు తప్పవు. అయితే ఈ సారి మాత్రం తాగునీటి కష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకు హైదరాబాద్ జలమండలి సంస్థ పక్కా ప్లాన్ రూపొందించామని చెబుతోంది.

గతేడాది 352 మిలియన్ గ్యాలన్ల తాగునీరు సరఫరా ...

గ‌తేడాది రోజుకు 352 మిలియ‌న్ గ్యాల‌న్ల తాగునీరు స‌ర‌ఫ‌రా అయితే ఈ సారి ఇప్పటికే 372 మిలియ‌న్ గ్యాల‌న్ల తాగునీరు స‌ర‌ఫ‌రా అయిందని.. ప్రస్తుతం నగర అవసరాల కోసం 602 మిలియ‌న్ గ్యాల‌న్ల తాగునీరు అందుబాటులో ఉందని జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు.

సమ్మర్‌లో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌....

ఇక‌ స‌మ్మర్‌లో ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించామ‌ని.. ఇందుకోసం 5.81కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌న్నారు. బోర్డు ప‌రిధిలో ఉన్న 900వాట‌ర్ ట్యాంక‌ర్లలో 338 ట్యాంక‌ర్లను నీటి ప్రాబ్లమ్ ఉండే ప్రాంతాల‌కు ప్రతిరోజు 1500 ట్రిప్పులు పంపిణి చేసేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. తాగు నీటిక‌ష్టాలు ఉత్పన్నం కాకుండా 45మంది స్పెష‌ల్ అధికారులను నియ‌మించామని చెప్పారు.

రూ. 1900 కోట్ల హడ్కో రుణంతో చేపట్టిన పనుల్లో పురోగతి.....

శివారు ప్రాంతాలకు తాగు నీటిని అందించ‌డం కోసం 1900కోట్ల రూపాయల హడ్కో రుణంతో చేప‌ట్టిన ప‌నుల్లో పురోగతి ఉందన్నారు. 2600 కిలోమీట‌ర్ల ప‌నుల్లో ఇప్పటి వ‌ర‌కు 908 కిలో మీట‌ర్ల మేర పైపులైన్ ప‌నులు పూర్తి చేశామ‌న్నారు. ఆయా ప్రాంతాల్లో 10వేల న‌ల్లా క‌నెక్షన్‌లకు నూత‌నంగా ఏర్పాటు చేసిన లైన్ ద్వారా నీరు అందిస్తామన్నారు. ఇప్పటి వ‌ర‌కు 19రిజ‌ర్వాయ‌ర్లు పూర్తయ్యాయ‌ని, ఏప్రిల్ నాటికి మ‌రో 15 పూర్తి చేస్తామ‌న్నారు. ప్రతిసారి ఎండాకాలం ముందు ఎలాంటి ఇబ్బందులు లేవంటూ అధికారులు చెప్పడం మామూలేనని.. ఈసారైనా ఇబ్బందులు లేకుండా చూస్తారో లేదో చూడాలని నగరవాసులు కోరుతున్నారు.

Don't Miss