ప్రాధాన్యం కోల్పోతున్న డీఎస్..

13:42 - May 19, 2017

నిజామాబాద్ : ధర్మపురి శ్రీనివాస్‌... నిజామాబాద్‌ జిల్లా రాజకీయాలను మూడు దశాబ్దాలపాటు శాసించిన నేత. ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా 2004, 2009లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన విజయసారధి. తెలంగాణ వచ్చిన తర్వాత అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు పార్టీలో ప్రాధాన్యతలేని నేతగా ముద్ర వేసుకున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత డీఎస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపారు. ఉమ్మడి ఏపీలో అటు రాష్ట్రంతోపాటు, ఇటు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన డీఎస్‌కు టీఆర్‌ఎస్‌లో అంత ప్రాధాన్యత లేకుండా పోయింది. జిల్లాలో పవర్‌ పాలిటిక్స్‌ ఎంపీ కవిత కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. దీంతో ఇప్పుడు డీఎస్‌ కిమ్మనండంలేదు. ఒప్పుడు డీఎస్‌ చెప్పిందే వేదం. అధికారులైనా, నేతలైనా శ్రీనివాస్‌ చెప్పినట్డు నడుచుకునేవారు. ఇప్పుడంతా కవిత ఆధిపత్యం కొనసాగుతోంది. డీస్సైనా, మరొకరైనా కవిత చెప్పినట్టు వినాల్సిందే. టీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత లేకపోవడంతో అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారు. ఏదైనా శుభకార్యం జరిగితే నిజామాబాద్‌ వచ్చిన హాజరై వెళ్తారు. తెలిసిన వారు ఎవరైనా చనిపోతే పరామర్శించి పోతారు. అధికార కార్యక్రమంల్లో పాల్గొనడం చాలా అరుదు.

అగమ్యగోచరంగా పరిస్థితి
డీఎస్సే కాదు, డీఎస్‌తోపాటు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన అనుచరులకు కూడా టీఆర్ఎస్‌లో పెద్దగా ప్రధాన్యత లేకపోవడంతో ఇద్దరూ బాధపడుతున్నారు. కాంగ్రెస్‌ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలతో సన్నిహిత సంబధాలు నిర్వహించిన డీఎస్‌కు ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఒక్కసారిగా ప్రాధాన్యత తగ్గడంతో ఇతని అనుచరులు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని భావిస్తున్నారు. డీఎస్‌ చెప్పినా పనులు కావడంలేదు, కవితతో చెప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో వీరి పరిస్థితి అడకొత్తెరలో పోకచక్కచందగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నారు. డీఎస్‌ను నమ్ముకున్న చోటా మోటా నేతలు... టీఆర్‌ఎస్‌ జిల్లా కమిటీల్లో స్థానం, జిల్లా స్థాయిలో ఉండే నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెంచుకున్నారు. కానీ ఇప్పుడు కవిత చక్రం తిప్పుతోండటంతో తమ ఆశలు అడియాశలవుతున్నాయని బాధపడుతున్నారు. రెండికీ చెడ్డ రేవడి చందంగా మారిందని, అటు ఇంటి కూటికి, ఇటు బంతి కూటికి నోచుకోని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

Don't Miss