జనం లేని 'జన్మభూమి'

20:33 - January 6, 2017

ప్రకాశం : ఏపీ ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తోన్న జన్మభూమికి జనాలు కరువయ్యారు. జనాలను రాబట్టేందుకు... వారిని ఆకర్షించేందుకు అధికారులు, స్థానిక నాయకులు పడుతున్న ఆరాటం విమర్శలకు తావిస్తోంది. ఖాళీ కుర్చీలను నింపుకునేందుకు పాఠశాలకు వచ్చిన విద్యార్థులతో నృత్యాలు చేయించడంపై గ్రామస్థులు సైతం మండిపడతున్నారు.  గత మూడు జన్మభూమి కార్యక్రమాల్లోని సమస్యలను పరిష్కరించకుండా ఈ కొత్త తంతేంటని  పెదవి విరుస్తున్నారు. 
గ్రామసభలను బహిష్కరించిన జనాలు 
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్న చందంగా మారింది 'జన్మభూమి మా ఊరు'  కార్యక్రమం. ప్రకాశం జిల్లాలో పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల జనాలు గ్రామసభలను బహిష్కరిస్తే ... మరికొన్ని చోట్ల అధికారులే హాజరుకాని పరిస్థితి. ఇంకొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధుల ఆర్భాటపు చర్యలు ... వెరసి జన్మభూమి కార్యక్రమం నిలువునా అబాసుపాలవుతోంది. 
జనం ఆశలు అడియాశలు
జన్మభూమి కార్యక్రమమంటే ఫించన్లు, రేషన్ కార్డుల సమస్యలు తీరుతాయని ఎంతో ఆశతో ప్రజలు దూర ప్రాంతాల నుంచి వస్తారు. అయితే వారి ఆశలు అడియాశలుగానే మిగిలిపోతున్నాయి. గతంలో ఇచ్చిన అర్జీలకు సమాధానం లేదు. ఫించన్లు, ఇళ్లస్థలాలు, రేషన్ కార్డులు తదితర విన్నపాలతో ముందుకొచ్చిన వారికీ నేటికీ సమాధానం లేదు. కానీ మళ్లీ పాతపాట పాడుతున్న అధికారుల తీరుకు జనాలు విసిగెత్తిపోతోన్న పరిస్థితి అంతటా కనబడుతోంది.  అర్జీలు ముందుకు నడవాలన్నా... వాటిని ఆమోదింపజేసుకోవాలన్నా అధికార పార్టీ దీవెనలు కావాల్సి రావడంతో కొంతమంది స్వచ్ఛందంగానే ప్రయత్నాలు విరమించుకుంటోన్న పరిస్థితి నెలకొంది. 
జన్మభూమి కార్యక్రమాల్లో డొల్లతనం
ఇక అధికారుల విషయానికి వస్తే... ఉదయం నుంచి సాయంత్రం వరకూ అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది మధ్యాహ్నమే ఉడాయించడం...తాజా జన్మభూమి కార్యక్రమాల్లోని డొల్లతనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వస్తేనో లేదా మంత్రి వస్తేనో  వారు ఉన్నంత వరకు జన్మభూమి నడుస్తోంది. ఆ ప్రజాప్రతినిధులు వెళ్లిపోయాక కార్యక్రమం బేలగా మారిపోతోంది. ఇది జిల్లాలోని ప్రతినియోజకవర్గంలోని పరిస్థితి. దీనికి తోడు నియోజకవర్గాల్లోని తెలుగు తమ్ముళ్ల మధ్య ఏర్పడ్డ వివాదాలు కూడా జన్మభూమి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూసిస్తున్నాయి. దీంతో కొన్ని చోట్ల పోలీసు పహారాల నడుమ కార్యక్రమాలు జరగాల్సి వస్తోంది. 

 

Don't Miss