తిరుపతికి వెళుతున్నారా..జాగ్రత్త...

09:29 - April 29, 2018

చిత్తూరు : తిరుపతిలో ఎండలు మండుతున్నాయి. భానుడి దెబ్బతో నగర వాసులు విలవిల్లాడిపోతున్నారు. గత 10 రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్థానికులతో పాటు శ్రీవారి దర్శనం కోసం వస్తున్న భక్తులు సైతం సూర్యప్రతాపానికి విలవిలలాడుతున్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ఎండలు మండుతున్నాయి. గత పది రోజులుగా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఇదే పరిస్థితి. ఇక మిట్ట మధ్యాహ్నం భానుడు టాప్ గేర్‌లో కాకపుట్టిస్తున్నాడు. దీంతో నగర వీధులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. వేసవి సెలవులు కొనసాగుతుండటంతో తిరుమలకు యాత్రికుల తాకిడి భారీగా పెరిగింది. అయితే ఎండల తీవ్రతతో శ్రీవారి భక్తులు బెంబేలెత్తుతున్నారు. కొండపైకి వెళ్ళడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే...ఇక మే నెల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.

ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంవల్ల తప్పనిసరి అయితే తప్ప ఎండలో తిరగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. మంచినీటితోపాటు.. తలమీద టవల్‌, నీడకోసం గొడుగు లాంటివి వాడాలంటున్నారు. జాగ్రత్తలు తీసుకోకుంటే వడదెబ్బతో ఇబ్బందుల పాలవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

Don't Miss