ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాం : సీఎం చంద్రబాబు

21:43 - January 7, 2018

కర్నూలు : ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని జన్మభూమి కార్యక్రమం వేదికగా మారిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కర్నూలు జిల్లా జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ ప్రాణనాడిగా మారుస్తామని హామీ ఇచ్చారు.
కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన
జన్మభూమి-మావూరు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆత్మకూరు మండలం సిద్ధాపురంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సిద్ధాపురం ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించి, నీరు విడుదల చేశారు. దీనికి బుడ్డావెంగళరెడ్డి సిద్ధాపురం ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టారు. 119 కోట్ల రూపాయల వ్యయంతో సిద్ధాపురం ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టామని, ఈ పథకం ద్వారా 23 వేల ఎకరాలకు సాగునీరు, 12 గ్రామాలకు తాగునీరు అందుతుందని చంద్రబాబు అన్నారు. 
ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించుకోవాలి : చంద్రబాబు
నీళ్లు, అడవులు, ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించుకోవాలని చంద్రబాబు ప్రజలకు పిలుపు ఇచ్చారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కృష్ణా పుష్కరాలను పెద్ద ఎత్తున నిర్వహించామని, రైతులకు రూ. 24వేల కోట్ల రుణమాఫీ చేశామని, రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా తయారు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చుల వివరాలను ప్రకటించారు. సాగునీటి కోసం ఇంతవరకు 50 వేల కోట్లు ఖర్చు చేసినట్టు ప్రజల దృష్టికి తెచ్చారు. కర్నూలు జిల్లాలో కేసీ కాల్వపై నిర్మిస్తున్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ ప్రాణనాడిగా మారుస్తామని హామీ ఇచ్చారు. గ్రామ సభకు హాజరైన ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి-మావూరు ప్రతిజ్ఞ చేయించారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో జరిగే జన్మభూమి-మావూరు కార్యక్రంలో చంద్రబాబు పాల్గొంటారు. 
 

Don't Miss