కత్తి మహేశ్‌, పవన్‌ ఫ్యాన్స్ మధ్య ముదురుతున్న వివాదం

21:39 - January 7, 2018

హైదరాబాద్ : పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌పై సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరు కలిసి క్షుద్రపూజలు చేసింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. తనతో చర్చకు రావాలని  పవన్‌కు సవాల్‌ విసిరిన మహేష్..సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌కు వచ్చి హల్‌చల్‌ చేశారు. అభిమానులు తనపై చేస్తున్న దాడులను పవన్‌ కల్యాణ్‌ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమలలో పవన్‌తో పాటు ఒకే గోత్ర నామాలతో నటి పూనం కౌర్‌ ఎందుకు పూజ చేయించుకున్నారని ప్రశ్నించారు. ఆమెకు బ్రాండ్‌ అంబాసిడర్‌ పదవి ఎలా వచ్చిందో చెప్పాలంటూ కత్తి మహేష్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. 
సోషల్‌ మీడియాలో మరింత వేడెక్కిన వార్‌  
సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌, పవన్‌ ఫ్యాన్స్ మధ్య వివాదం అంతకంతకు ముదురుతోంది. సోషల్‌ మీడియాలో కొనసాగుతున్న వార్‌ మరింత వేడెక్కింది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో కాక పుటిస్తోంది.  మొన్నటి దాకా ట్విట్టర్‌లో జరిగిన వార్‌..ఇప్పుడు ఫేస్‌ టు ఫేస్‌ అనే దాకా వచ్చింది. చర్చకు రావాలంటూ పవన్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేసిన కత్తి మహేష్..అన్నట్లుగానే సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు  వచ్చారు. పవన్‌ అభిమానులు కూడా ప్రెస్‌క్లబ్‌కు రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముందుగానే భారీగా మోహరించిన పోలీసులు..పవన్‌ ఫ్యాన్స్‌ను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. 
పూనం కౌర్‌పై కత్తి మహేష్ సంచలన ఆరోపణలు
నటి పూనం కౌర్‌పై కత్తి మహేష్ సంచలన ఆరోపణలు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. తనకు ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చిందో పూనం చెప్పాలన్నారు. తిరుమలలో  పవన్ కల్యాణ్‌తో పాటు ఒకే గోత్ర నామాలతో పూనం ఎందుకు పూజ చేయించుకున్నారు? పవన్ మోసం చేశారన్న భావనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే, మిమ్మల్ని కాపాడింది ఎవరు? ఆ  సమయంలో ఆస్పత్రిలో చికిత్సకు ఎంత ఖర్చయింది? ఆ బిల్లు ఎవరు చెల్లించారు? పవన్ మీ అమ్మను కలిసి ఏం ప్రామిస్ చేశారు? ఇప్పటివరకు అది నెరవేర్చారా ? లేదా ? డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే  మీకు ఎందుకంత కోపం? ఓ క్షుద్రమాంత్రికుడితో కలసి పవన్‌, త్రివిక్రమ్ పూజలు చేస్తుంటే, అక్కడ మీరు ఏం చేశారు? ఈ ప్రశ్నలకు పూనం సమాధానం చెప్పాలని కత్తి మహేష్ డిమాండ్ చేశారు.  తాను సంధించిన ప్రశ్నలకు సంబంధించి అన్ని ఆధారాలూ తన వద్ద ఉన్నాయని చెప్పారు. 
కోన వెంకట్‌పైనా మండిపడ్డ కత్తి 
సినీ రచయిత కోన వెంకట్‌పైనా మండిపడ్డారు కత్తి మహేష్‌‌. తనపైకి పవన్‌ ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. పవన్‌ ఫ్యాన్స్‌ తీవ్రవాదులుగా మారతారని కోన వెంకట్‌  బెదిరిస్తున్నారని ఆరోపించారు. పవన్‌ అభిమానులు తన కుటుంబ సభ్యులను బూతులు తిడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఓ దళితుడిగా తాను ఎన్నోసార్లు సామాజిక  బహిష్కరణను చూశానన్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా తనను బహిష్కరించారని ఆరోపించారు. తన వెనుక ఏ రాజకీయపార్టీ లేదని, ఎలాంటి రాజకీయ అజెండాలేదన్నారు కత్తి మహేష్‌‌. 
రేణుదేశాయ్‌ని విమర్శించినా పవన్‌ స్పందించలేదు : కత్తి మహేష్‌ 
రేణుదేశాయ్ తన రెండో వివాహం గురించి ప్రస్తావిస్తే, ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపేస్తామని పవన్‌ అభిమానులు హెచ్చరించడం దారుణమన్నారు కత్తిమహేష్‌. కనీసం ఆ వ్యాఖ్యలను సైతం పవన్  ఖండించలేదని, ఇక ఆయన ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తన అభిమానులను ఎంతమాత్రమూ కంట్రోల్ చేయలేకపోతున్నారని విమర్శించారు. తాను ఎన్నడూ పవన్ పై వ్యక్తిగత విమర్శలు  చేయలేదని, రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే చేశానని, వాటికి సమాధానం చెప్పలేని ఆయన, రాష్ట్రానికి ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. తన ప్రాణాలకు అపాయం ఉందని, దీంతోనే ఈ వివాదానికి  పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తే, తనతో చర్చించేందుకు ఎవరూ రాలేదన్నారు. నిజాలేవీ తెలియకుండా అవాక్కులు చవాక్కులు మాట్లాడుతున్న వ్యక్తిని ఉపేక్షించవద్దని సీనియర్‌ నటి కుష్భూ కత్తి మహేష్‌పై విరుచుకుపడ్డారు. అతన్ని అడ్డుకునే అవకాశం ఉన్నా.. పదే పదే ఎందుకు విమర్శలకు దిగుతున్నాడని ప్రశ్నించారు.  

 

Don't Miss