అమలుకాని దళితులకు భూమి పథకం

17:35 - March 8, 2017

హైదరాబాద్: దళితులకు మూడు ఎకరాల భూమి. ఇది టిఆర్ఎస్ ఎన్నికల వాగ్ధానం. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అంతే. ఆ ఒక్క రోజు సంబరంతోనే సరిపెట్టింది. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని అటకెక్కించింది. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే, ప్రయివేట్ భూమి కొనైనా సరే, ఒక్కొక్క దళిత కుటుంబానికి మూడేసి ఎకరాల చొప్పున పంపిణీ చేస్తామంటూ టిఆర్ఎస్ నాయకులు చెప్పుకొచ్చారు. కానీ, ఆచరణలో అది కనిపించడం లేదు. ప్రభుత్వం నిజంగా మూడు ఎకరాల భూమి ఇస్తుందని ఆశ పడ్డ దళితులు ఇప్పుడు భంగపడ్డారు. సిపిఎం నిర్వహించిన మహాజన పాదయాత్రలో అనేకమంది దళితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇదే ఇవాళ్టి స్పెషల్ ఫోకస్.

మూడెకరాల భూమి ఇచ్చిన దాఖలాలు కనిపించవు....

కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల ఎక్కడకెళ్లినా దళితులకు మూడెకరాల భూమి ఇచ్చిన దాఖలాలు కనిపించవు. పాత కరీంనగర్ జిల్లాలో దాదాపు లక్షా 20 వేల మంది దళిత కుటుంబాలకు భూమి లేనట్టు అధికారులు గుర్తించారు. కానీ, వీరిలో 300 కుటుంబాలకు మాత్రమే భూ పంపిణీ చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఎక్కడ లక్షా 20 వేలు ఎక్కడ మూడొందలమంది? ఈ లెక్కన భూమిలేని దళితులందరికీ మూడు ఎకరాల భూమి ఇవ్వాలంటే ఎన్ని దశాబ్ధాలు పడుతుందో ఊహించుకోవచ్చు.

అసలు సెంటు భూమి కూడా లేని దళితులకు...

అసలు సెంటు భూమి కూడా లేని దళితులకు మూడు ఎకరాల చొప్పున , ఎకరం వున్న వారికి రెండెకరాల చొప్పున, రెండెకరాలున్నవారికి ఎకరం చొప్పున ఇస్తామంటూ ఎన్నెన్నో వాగ్ధానాలు చేశారు కెసిఆర్. తామిచ్చిన భూములను సాగుకు యోగ్యంగా తీర్చిదిద్దేందుకు ఏడాదిపాటు వ్యవసాయ ఖర్చుల కూడా భరిస్తామంటూ మరెన్నో మాటలు చెప్పారు. కెసిఆర్ మాటలు నమ్మి చాలామంది ఆయన ఫోటోలకు పాలాభిషేకాలు చేశారు. ఇక తమ జీవితాలు మారిపోతాయంటూ మురిసిపోయారు. కానీ చివరకు నిరాశే మిగిలింది. కెసిఆర్ ప్రభుత్వం దళితులకు భూమి పంచిందీ లేదు. దుక్కి దున్నిందీ లేదు.

20 వేల దళిత కుటుంబాలకు భూమి లేదన్నది అధికారుల సర్వేల సారాంశం...

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్షా 20 వేల దళిత కుటుంబాలకు భూమి లేదన్నది అధికారుల సర్వేల సారాంశం. వీరందరికీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే 3 లక్షల 60 వేల ఎకరాల భూమిని పంచాల్సి వుంటుంది. కానీ, ఇప్పటి వరకు మూడు వందల కుటుంబాలకు పంపిణీ చేసింది కేవలం 755 ఎకరాల 9 గుంటలు. పంపిణీ చేసిన భూమిలో ప్రభుత్వ భూమి 103 ఎకరాల 20 గుంటలు కాగా, ప్రయివేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసింది 651 ఎకరాల 29 గుంటలు. మిగిలిన దళిత కుటుంబాలకు భూమి పంచేదెప్పుడు? రెండేళ్లలో కేవలం 755 ఎకరాల భూమి పంచిన ప్రభుత్వం మరో వందేళ్లకైనా ఆ పని పూర్తి చేయగలదా? ఇదే ప్రశ్న సంధిస్తున్నాయి దళిత సంఘాలు. కరీంనగర్ జిల్లా విడిపోక పూర్వం అప్పటి జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన ప్రయివేట్ భూములు కొనుగోలు చేసేందుకు సర్వే చేపట్టిన్నప్పటికీ అడుగు ముందుకు కదలలేదు. ఇప్పట్లో దళితులకు మూడు ఎకరాల కల సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దళితులకు మూడు ఎకరాల భూమి పథకం అమలు కోసం పోరాడేందుకు సిపిఎం సమాయత్తమవుతోంది.

 

మహబూబ్ నగర్ జిల్లాలో....

పాలమూరు జిల్లాలో దళితుల ఆశలు అడియాలవుతున్నాయి. మూడు ఎకరాల భూమి పథకం తూతూ మంత్రంగా సాగడంతో దళితులు తీవ్రంగా నిరాశచెందుతున్నారు. భూములు దొరకడం లేదన్న వంకతో ఈ పథకాన్ని అటకెక్కిస్తున్నారు. భూములు అందుబాటులో వున్నా , వాటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు.

స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా ప్రారంభమైన...

స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా ప్రారంభమైన దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ కార్యక్రమం ఆరంభ అట్టహాసంగానే మిగిలిపోతోంది. పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటి దాకా పంపిణీ చేసింది కేవలం 889 ఎకరాలు మాత్రమే. 303 కుటుంబాలకు మాత్రమే పంపిణీ చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.

సిపిఎం మహాజన పాదయాత్రలో ...

సిపిఎం మహాజన పాదయాత్రలో మహబూబ్ నగర్ జిల్లాలో అనేకమంది దళితులు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు మూడు ఎకరాల భూమి సమస్యపై వినతిపత్రాలు సమర్పించినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి వందల మంది నిత్యం వలసపోతుంటారు. దళితులకు మూడు ఎకరాల చొప్పున భూమిని పంచి, వలసలను అరికడతామంటూ టిఆర్ఎస్ నాయకులు ఎన్నెన్నో మాటలు చెప్పారు. కానీ అవేవీ వాస్తవ రూపం దాల్చడం లేదు. దళితులకు మూడు ఎకరాల భూమి పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలంటే ఎంత భూమి కావాలి? అన్న విషయంలో అధికారుల దగ్గర స్పష్టమైన సమాధానం దొరకని పరిస్థితి కనిపిస్తోంది. భూములను గుర్తించే విషయంలో అంతులేని అలసత్వం కనిపిస్తోంది.

పంచిన కొద్ది పాటి భూమి విషయంలోనూ కొన్ని వివాదాలు...

పంచిన కొద్ది పాటి భూమి విషయంలోనూ కొన్ని వివాదాలు నెలకొన్నాయి. ధన్వాడ మండలంలో అధికారుల నిర్వాకం వివాదస్పదమైంది. ఒకరి భూమిని మరొకరికి పంచడం పంచాయితీకి కారణమైంది. పాత మహబూబ్ నగర్ జిల్లాలో బంజరు, సీలింగ్, దేవాలయం, ఇనాం భూములు కలిపితే, ఏడు లక్షల ఎకరాలకు పైగా భూమి వుంది. దీన్నిబట్టి భూమి కొరతలేదన్న విషయం స్పష్టమవుతోంది.

ఆగస్టు 15న నాడు పట్టాలిచ్చిన దళితుల్లో కొందరికి ...

ఆగస్టు 15న నాడు పట్టాలిచ్చిన దళితుల్లో కొందరికి ఇప్పటికీ భూములు చూపించలేదు. కొన్ని సర్వే నెంబర్లలో రాళ్లు, తుప్పలున్నాయి. అవి సాగుకి అనుకూలంగా లేవు. దళితులకు మూడు ఎకరాల భూమి పథకాన్ని అమలు చేయాలంటూ మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు మమబూబ్ నగర్ జిల్లా సిపిఎం నేతలు.

Don't Miss