బ్రాహ్మణి స్టీల్స్‌, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఇక కలేనా..?

07:39 - June 14, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణి స్టీల్స్‌.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఇక కలేనా..? దీనికి అవుననే సమాధానమే వస్తోంది. ఈ రెండు కర్మాగారాలు ఏర్పాటు చేయడం అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఇదేదో నోటిమాటగా కాకుండా.. ఏకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ రూపంలో వెల్లడించింది. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లో.. నేతలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు 
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి
కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపిస్తూనే ఉంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నిరుద్యోగులకు వరం కాగల.. బ్రాహ్మణి స్టీల్స్‌, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఇంతకాలం తాత్సారం చేస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడిక ఆ కర్మాగారాలను ఏర్పాటు చేయలేమని తెగేసి చెప్పింది. ఈ అంశంపై.. తెలంగాణ కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకరరెడ్డి పిటిషన్‌ వేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. అందులో ఏపీ, తెలంగాణల్లో స్టీల్‌ ఫ్యాక్టరీల నిర్మాణం సాధ్యం కాదనే నివేదికలు వచ్చాయని వెల్లడించింది. కడపలో బ్రాహ్మణి స్టీల్స్‌ సాధ్యాసాధ్యాలపై మెకాన్‌ సంస్థ పరిశీలిస్తోందని, నివేదిక అందాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడించింది. కడపతో పాటు, బయ్యారం వ్యవహారం కూడా టాస్క్‌ ఫోర్స్‌ పరిధిలో ఉందని.. ఈ సమయంలో విభజన హామీలపై పిటిషన్‌ విచారణకు అర్హం కాదంటూ కేంద్రం అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. 
ఢిల్లీలో టాస్క్‌ఫోర్స్‌ భేటీ 
నిజానికి కేంద్ర ఉక్కు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో టాస్క్‌ఫోర్స్‌ భేటీ జరిగింది. బ్రాహ్మణి, బయ్యారం వ్యవహారాన్ని ఇందులో ఓ కొలిక్కి తెస్తారని... భేటీకి హాజరైన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు భావించారు. అయితే.. తాను కొత్తగా బాధ్యతలు స్వీకరించినందున.. స్టీల్‌ ప్లాంట్‌లకు చెందిన సమగ్ర సమాచారం కోసమే సమావేశం నిర్వహించానని, కేంద్ర గనుల శాఖ సంయుక్త కార్యదర్శి చెప్పడంతో.. అధికారులు విస్తుపోయారు. దీనిపై తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. బ్రాహ్మణి స్టీల్స్‌ విషయంలో.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ, సీఎంరమేశ్‌.. ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. 
బ్రాహ్మణి స్టీల్స్‌ ఏర్పాటు విషయంలో కేంద్రం ఉదాసీనత 
విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. ఇతర వివిధ అంశాల తరహాలోనే.. కేంద్ర ప్రభుత్వం బ్రాహ్మణి స్టీల్స్‌ ఏర్పాటు విషయంలోనూ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఈ ప్రాంత నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణను రూపొందించకుండా.. సమావేశాల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడుతున్నారు. ఈనేపథ్యంలోనే.. స్థానిక అన్ని పక్షాలను కలుపుకుని ఉద్యమాన్ని నిర్మించాలని పాలక పక్షం నాయకులు యోచిస్తున్నారు. 

 

Don't Miss