ఆసక్తి రేపుతోన్న కేసీఆర్‌ హస్తిన టూర్‌

07:13 - June 14, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో కేసీఆర్‌ హస్తినబాట సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అధికారిక పర్యటనే అయినా... రాజకీయంగా కూడా ఈ పర్యటనకు ప్రాధాన్యత ఉంటుందన్న సంకేతాలను పార్టీ వర్గాలు ఇస్తున్నాయి. నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనేందుకు కేసీఆర్‌ వెళ్తున్నా... ఫెడరల్‌ ఫ్రంట్‌పై కూడా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రేపు ప్రధానితో కేసీఆర్‌ భేటీ ఏం చర్చిస్తారన్న ఉత్కంఠకు గురిచేస్తోంది.
బీజేపీ, కాంగ్రెస్‌ యేతర సీఎంతో కేసీఆర్‌ భేటీ
తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన  రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.  ఇవాళ ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఆయన తిరుగుపయనం కానున్నారు. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేందుకు సిద్ధ మవుతున్న కేసీఆర్‌... హస్తినకు వెళ్తుండడం ఆసక్తి రేపుతోంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో ఇప్పటికే పలువురు ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుసుకున్న కేసీఆర్‌.... ఈ  విడత ఢిల్లీ టూర్‌లో కూడా ఫ్రంట్‌పై చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. నీతి అయోగ్‌ సమావేశానికి అన్నిరాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉండడంతో.... కాంగ్రెస్‌, బీజేపీ యేతర రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ చర్చలు జరిపే అవకాశముంది. కర్నాటక ఎన్నికల తర్వాత కాస్త సైలెంట్‌గా ఉన్నా... ఈ విడత ఢిల్లీ పర్యటనతో మరోసారి జాతీయ రాజకీయాల్లో వేడి పుట్టించే చాన్స్‌ ఉంది.
రక్షణశాఖ తీరుపై కేసీఆర్‌ గుర్రు
ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రకటన తర్వాత కేసీఆర్‌ ఇటీవలే ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ప్రధాని మాత్రం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో... కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీకావాల్సి వచ్చింది. పునర్విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో... ఆ హామీల కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు గులాబీ దళపతి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఎయిమ్స్‌ లాంటి సంస్థల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా.. అది ఆచరణకు నోచుకోకపోవడంతో... సీఎం కేంద్రంపై గుర్రుగా ఉన్నారు.  కొత్త సచివాలయ నిర్మాణానికి రక్షణశాఖ నుంచి భూ కేటాయింపు జరపాలని కోరినా కేంద్రం స్పందించకపోవడంపై సీరియస్‌గా ఉన్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అమలు చేసిన రైతుబంధు, రైతు బీమాలాంటి పథకాలను జాతీయ స్థాయిలో అమలు చేయాలన్న డిమాండ్‌ను కేసీఆర్‌ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
కేంద్రాన్ని ఇరకాటంలో పడవేసేందుకు కేసీఆర్‌ ప్లాన్‌
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలను తెరపైకి తీసుకొచ్చి.. కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ స్థాయిలో ఇరకాటంలో పడవేసేందుకు కేసీఆర్‌ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. రిజర్వేషన్లపై రాష్ట్రాలకే హక్కులు ఉండాలనన డిమాండ్‌ను ఆయన వినిపించే అవకాశముంది. మిషన్‌భగీరథతోపాటు సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని  మరోసారి కేంద్రంముందు తమ డిమాండ్‌ను ఉంచనున్నట్టు తెలుస్తోంది.

 

Don't Miss