దవళేశ్వరంలో ప్రారంభమైన కాంగ్రెస్ పాదయాత్ర

21:48 - January 7, 2018

తూర్పుగోదావరి : పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీ కాంగ్రెస్‌ నేతలు పోరాటం ప్రారంభించారు. ఈ  ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు  ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపిస్తూ మహా పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టును 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తామే ప్రారంభిస్తామని  పార్టీ నాయకులు చెబుతున్నారు. 
పోలవరం కోసం ఏపీ కాంగ్రెస్‌ మహాపాదయాత్ర 
పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీ కాంగ్రెస్‌ నాయకులు మహాపాదయాత్ర చేపట్టారు. రాజమండ్రి సమీపంలోని దవళేశ్వరంలో సర్‌ ఆర్థర్‌ కాటన్‌ విగ్రహానికి పూలమాలవేసి యాత్ర ప్రారంభించారు. పుదుచ్ఛేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈ యాత్రను ప్రారంభించారు. 
నాలుగు రోజులపాటు పోలవరం పాదయాత్ర 
నాలుగు రోజులపాటు పోలవరం పాదయాత్ర కొనసాగుతుంది. రాష్ట్ర ప్రజల హక్కు పోలవరం ప్రాజెక్టు ఫలాలు అందరికీ అందేవరకు పోరాటం అన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ నాయకులు ఈ యాత్ర చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొదటిరోజు పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు వరకు 12.5 కి.మీ. పాదయాత్ర చేశారు. 
పాదయాత్రను ప్రారంభించిన పుదుచ్ఛేరి సీఎం నారాయణస్వామి... 
ధవళేశ్వరం వద్ద పోలవరం పాదయాత్రను ప్రారంభించిన పుదుచ్ఛేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి... ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచుతూ చంద్రబాబు దోచుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. 
సభకు ఉండవల్లి, హర్షకుమార్ హాజరు  
పోలవరం పాదయాత్ర పారంభోత్సవ సభ వేదిక వద్దకు మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్‌, జీవీ హర్షకుమార్‌ హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.  కాంగ్రెస్‌ నాయకులు ఈ ఇద్దర్నీ ఆహ్వానించడంతో వేదికపైకి వచ్చి సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్‌  నుంచి తనను వెలివేసినా పార్టీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్న విషయాన్ని ఉండవల్లి ప్రస్తావించారు. పోలవరం కోసం ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధమన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రులు పనబాక లక్ష్మి, పల్లంరాజు, కిల్లి కృపారాణి, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాదయాత్రలో పాల్గొన్నారు. పోలవరంపై వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి తెస్తామన్నారు. 
 

Don't Miss