ఖాకీల నెలవారీ వసూళ్లు.....

08:21 - June 13, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో ఖాకీల నెలవారీ వసూళ్ల వ్యవహారం పోలీస్‌శాఖనే నివ్వెరపరుస్తోంది. ప్రతి అక్రమ దందాలో పోలీసుల సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. ఖాకీల మామూళ్ల వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ కూడా సీరియస్‌ అయ్యారు. రహస్య విచారణ సాగించి పలువురిని సస్పెండ్‌ కూడా చేశారు. అయినా అక్రమ వసూళ్ల రుచి మరిగిన ఖాకీలు తమ పద్దతి మార్చుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారి పేర్లతో డీజీపీ కార్యాలయం జాబితాను విడుదల చేయడం సంచలనం రేపుతోంది.
పోలీస్‌శాఖలో నెలనెల మామూళ్ల వ్యవహారం
నిజామాబాద్‌ జిల్లా పోలీస్‌శాఖలో సిబ్బంది నెలనెల మామూళ్ల వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. ఖాకీల నెలవారీ మామూళ్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గుట్కా, మట్కా, గంజాయి, ఇసుక మాఫియా , బెట్టింగ్‌ మాఫియా.... ఇలా ప్రతి అక్రమ దందాలో పోలీసులు నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు... సమస్యలపై పీఎస్‌కు వచ్చిన వారి నుంచి సైతం డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఆర్మూరు, బోధన్‌ డివిజన్స్‌లో అక్రమ వసూళ్లు
ఆర్మూరు, బోధన్‌ డివిజన్‌ పరిధిలో కొందరు ఎస్సైలు, ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు  అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఏకంగా రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఉన్నతాధికారులు రహస్య విచారణ చేపట్టారు.  బోధన్‌ ఏరియాలో ఇసుకదందాలో నెలనెలా మామూళ్లు తీసుకున్నారని బోధన్‌ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌తోపాటు రెంజల్‌ ఎస్సై రవికుమార్‌ను సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత మామూళ్ల దందాకు చెక్‌ పడుతుందని భావించారు. కానీ అది జరుగకపోగా... మరింత ఎక్కువైంది. 
నెలవారీ వసూళ్ల వ్యవహారంపై డీజీపీ సీరియస్‌
నెలవారీ మామూళ్ల వ్యవహారాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా సీరియస్‌గా తీసుకున్నారు. నిజామాబాద్‌ జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి లిస్ట్‌ను తెప్పించుకున్నారు. అందులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న 350 మంది పేర్లతో కూడిన జాబితాను డీజీపీ కార్యాలయం విడుదల చేసింది. ఇందులో కామారెడ్డి , నిజామాబాద్‌ జిల్లాలో పరిధిలోని 45 మంది ఖాకీలు ఉన్నారు.   దీంతో ఖాకీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎప్పుడు ఏ చర్యలు తీసుకుంటారోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.
 

 

Don't Miss