మాట్లాడే పుస్తకాలు..

19:06 - June 8, 2018

కరీంనగర్ : ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ చిన్నారులకు విద్యను అందించాలన్న సంకల్పంతో ముందుకెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం. వినూత్న ప్రయోగంతో ఈ విద్యాసంవత్సరంలో సరికొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ ప్రయోగంతో చిన్నారులు ఆధునికతను అందిపుచ్చుకోవడంతో పాటు శ్రమనూ తగ్గించుకోనున్నారు. 

తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు విద్య మరింత చేరువ కానుంది. చిన్నారుల్లో విద్య పట్ల ఆసక్తి పెంచాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యునిసెఫ్‌ సహకారంతో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించబోతోంది. ఈ ప్రాజెక్టు విధానంతో విద్యార్థులు.... నోటితో చదువుతూ విద్యనభ్యసించాల్సిన పరిస్థితికి చెక్ పడబోతోంది. వారు చదవాలనుకున్నది వారి చేతిలోని డివైజర్‌ చకచకా చదివేస్తుంది. 

ఇదిగో దీనిపేరే డాల్ఫియో డివైజర్‌..... ఈ వినూత్న ప్రయోగాన్ని ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 64 పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నారు. డాల్ఫియో డివైజర్ సిస్టం ద్వారా పుస్తకాల్లోని పాఠాలను వినే విధానం అమలు చేస్తున్నారు. ఇందుకోసం వంద తెలుగు, ఆంగ్ల పుస్తకాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. దీంతో  రైటింగ్ ఆర్థోమెటిక్ విధానం అమలు చేస్తున్నారు. చదువులో వెనకబడిన చిన్నారులు ఈ విధానంతో మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నారు ఉపాధ్యాయులు. 

డాల్ఫియో డివైజర్‌ను ఛార్జ్ చేసిన తరువాత ప్రతి బుక్‌పై గెట్ స్టార్టెడ్ పేరుతో ప్రత్యేకంగా చిప్ ను ఏర్పాటు చేశారు. ఆ చిప్ వద్ద డివైజర్ ఉంచి స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసిన డివైజర్‌ను పాఠ్యాంశంపై ఉంచితే డివైజర్‌ చక చకా చదివేస్తుంది. అయితే ఈ ఆదునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. డాల్ఫియో డివైజర్ విధానం వల్ల చిన్నారులకు భాషపై పట్టు... స్పష్టమైన ఉచ్ఛరణ కూడా వస్తుందని వారు ఆశిస్తున్నారు. ఈ విధానంపై విద్యార్థులూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సరికొత్త విధానంతో చిన్నారులు చదువుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని చేపడుతోన్న ఈ పద్దతిలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా బుక్‌పై చిప్‌ను ఏర్పాటు చేసినప్పుడు పేపర్‌ చినిగితే బుక్‌ను చదివే అవకాశం లేకుండా పోతుంది. ఈ సమస్యను అధిగమించ గలిగితే ఈ నూతన విధానం చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నిరక్షరాస్యత నిర్మూలన... డ్రాప్ అవుట్స్ ను బడికి రప్పించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి. 

 

Don't Miss