ఇంటర్ లో మధ్యాహ్న భోజనం

07:31 - February 12, 2018

సిద్దిపేట : ప్రభుత్వ విద్యాలయాలు నేటికీ కనీస వసతులు లేక కునారిల్లుతున్నాయి. సౌకర్యాల లేమి, ఉపాద్యాయుల కొరతతోపాటు.. సరిపడా తరగతి గదులు కూడా లేని దుస్థితిలో విద్యా బోధన కొనసాగుతోంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం వల్ల చాలా మంది విద్యార్థులు పాఠశాల విద్యతోనే చదువుకు స్వస్తి చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. విద్యార్ధులకు ఉచిత బస్‌పాస్‌లు, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని యోచిస్తోంది. విద్యార్థులకు ఉచిత పథకాలను అమలు చేస్తే ఎందరో విద్యార్థులు విద్యావంతులయ్యే అవకాశం ఉంటుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సుమారుగా పన్నెండు వేల మంది విద్యార్థులు లబ్ది పొందుతారు.. సంగారెడ్డి జిల్లాలో ఇరవై కళాశాలల్లో ఐదువేల మంది, మెదక్‌లో పదహారు కళాశాలల్లో మూడు వేల మంది, సిద్దిపేట జిల్లాలో ఇరవై కళాశాలల్లో ఐదు మేలమంది విద్యార్థులు ఉచిత పథకాలతో ఉన్నత విద్య వైపు వెళ్ళగలుగుతారు.

జూనియర్‌ కళాశాలల్లో తగ్గిన చేరికలు
ప్రభుత్వం విద్యార్థులకు చేయూత ఇవ్వకపోతే... ఇప్పటికే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో తగ్గిన చేరికలు మరింత తగ్గుముఖం పడతాయి. పాఠశాల విద్య నుంచే ఇబ్బందులు లేకుండా ఇంటర్‌ విద్యను అందించాలన్న సంకల్పంతో... ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశ రుసుము రద్దు చేసింది. ఇదే పరంపరలో బస్‌ పాస్, మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఆచరణలో పెట్టాలని అద్యాపకులు కూడా కోరుతున్నారు. గతంలో అనేక సమీక్షా సమావేశాల్లో లెక్చరర్లు, ప్రిన్సిపాల్‌లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు.ప్రభుత్వం అందించే గోరంత సాయంతో... విద్యార్థులకు కొండంత లాభం కలుగుతుందన్న అభిప్రాయాన్ని ఇటు విద్యార్థులు, అటు లెక్చరర్లు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థుల మంచి కోసం చేస్తున్న ఆలోచనను అందరూ స్వాగతిస్తున్నారు. 

Don't Miss